
ఖైరతాబాద్, వెలుగు: దేశ ప్రజల చేతిలో ఉన్న విలువైన ఆయుధం ఓటు అని, దళితులు దాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని చిరుతైగల్ కట్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తమిళనాడులోని చిదంబరం ఎంపీ తిరుమల్వన్ చెప్పారు. నూతన పార్లమెంట్ భవన నామకరణ కమిటీ, ఆలిండియా ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలో రమాబాయి అంబేద్కర్ 125వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి తిరుమల్వన్ చీఫ్ గెస్ట్‌గా హాజరై రమాబాయి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రమాబాయి త్యాగాల తల్లి అని కొనియాడారు. అంబేద్కర్ విజయం వెనుక ఉన్న అదృశ్య శక్తి రమాబాయి అని చెప్పారు. కొంత మంది రాజకీయ లబ్ధి కోసం హిందుత్వ ముసుగులో దళితేతరులను ఏకం చేసి అధికారంలోకి రావడానికి యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
హిందూ వాదులు.. అంబేద్కర్, రాజ్యాంగానికి బద్ద వ్యతిరేకమని, వారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి మనుస్తృతిని అమల్లోకి తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. దళితుల బతుకులు కేవలం ఓట్ల తోనే మారుతాయని, దేశంలో ఓట్ల ఉద్యమం రావాలని పిలుపునిచ్చారు. గద్దర్ మాట్లాడుతూ.. మహిళలు ముందు వరుసలో ఉండి ఉద్యమించినప్పుడే ఓట్ల విప్లవం వస్తుందన్నారు. ఆలిండియా ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు మహేశ్‌రాజ్, సామాజిక ఉద్యమ నేత జేబీ రాజు, ప్రొఫెసర్ మల్లేశం పాల్గొన్నారు.