ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.. పోలీస్​అధికారులతో రివ్యూ మీటింగ్​

ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.. పోలీస్​అధికారులతో రివ్యూ మీటింగ్​

మంచిర్యాల, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్‌‌‌‌‌‌‌‌  రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం కమిషనరేట్ లో మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు సుధీర్​ రాంనాథ్​ కేకన్, వైభవ్ ​గైక్వాడ్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, భూపాలపల్లి జయశంకర్​ఎస్పీలు ప్రవీణ్ కుమార్, సురేశ్ కుమార్, ఏ.భాస్కర్, పి.కరుణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ టి.కరుణాకర్ రావుతో పాటు పోలీసు అధికారులతో ఇంటర్​ డిస్ట్రిక్ట్​ బార్డర్​ రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.

అంతర్ జిల్లా సరిహద్దు చెక్​పోస్టుల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించాలని, సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలని, జాయింట్​కూంబింగ్ ఆపరేషన్, ఏరియా డామినేషన్స్, కమ్యూనిటీ కాంటాక్ట్​ ప్రోగ్రాంల నిర్వహణకు ప్లాన్​ రెడీ చేయాలని సూచించారు. ఉమ్మడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్​ యంత్రాల రవాణా బందోబస్తుపై చర్చించారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, ఆయుధాలను నియంత్రించాలన్నారు. వీవీఐపీలు, వీఐపీల టూర్ల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులను బైండోవర్ చేయడంలో అధికారుల పరస్పర సహకారం ఉండాలన్నారు.