
- గోదావరిఖనిలో మెయిన్ రోడ్ల పక్కన అడ్డుగా ఉన్న నిర్మాణాల కూల్చివేత
- ఏండ్లుగా రోడ్డు వెడల్పునకు అడ్డుగా బిల్డింగ్‌లు
- భారీ వాహనాలు తిరిగేందుకు అవస్థలు
- 10 రోజుల్లో దాదాపు 30 వరకు నిర్మాణాల కూల్చివేత
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో సర్వీస్‌రోడ్ల వెడల్పుకు మోక్షం లభించనుంది. 20 ఏండ్లకు పైగా మెయిన్ రోడ్ల పక్కనే సర్వీస్రోడ్లకు అడ్డుగా ఉన్న బిల్డింగ్‌లను ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. రాజీవ్ రహదారిపై బస్టాండ్ వద్ద గల బిల్డింగ్‌ను ఇటీవల కూల్చగా.. మార్కండేయ కాలనీ రహదారిలో రోడ్డుకు అడ్డంగా మరో బిల్డింగ్‌ను శనివారం కూల్చివేశారు. దీంతో రోడ్ల వెడల్పునకు లైన్ క్లియర్ కాగా.. సర్వీస్ రోడ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి.
25 ఏళ్లకు పైగా అడ్డుగా నిర్మాణాలు
హైదరాబాద్– కరీంనగర్– రామగుండం రాజీవ్‌రహదారిని హెచ్‌కేఆర్ సంస్థ నిర్మించగా, ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేశారు. కాగా గోదావరిఖని వద్ద బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లే మూలమలుపు వద్ద ఓ మాజీ ప్రజాప్రతినిధి బిల్డింగ్ అడ్డుగా ఉండడంతో ఇన్నాళ్లూ సర్వీస్‌రోడ్డు నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో మంచిర్యాల వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు గోదావరిఖని బస్టాండ్ నుంచి వచ్చే బస్సులకు కనిపించేవి కావు. ఈక్రమంలో ఈ ప్రాంతంలో చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. సుమారుగా 10 మంది వరకు చనిపోయారు. రోడ్డును విస్తరించి సర్వీస్ రోడ్డు నిర్మించేందుకు రామగుండం మున్సిపల్ ఆఫీసర్లు ప్రయత్నించిన ప్రతిసారి సదరు మాజీ ప్రజాప్రతినిధి కోర్టు ద్వారా ఆర్డర్లు తెప్పించి అడ్డుకునేవాడు.
దీంతో 25 ఏండ్లుగా రోడ్ల విస్తరణకు మోక్షం కలగలేదు. 10 రోజుల కింద రోడ్డుకు అడ్డంగా ఉన్న ఈ బిల్డింగ్‌ను కూల్చేశారు. దీనికితోడు బిల్డింగ్ పక్కనే షెడ్లలో ఏర్పాటు చేసుకున్న సుమారు 25 దుకాణాలను కూడా తొలగించారు. దీంతోపాటు గోదావరిఖని మార్కండేయకాలనీలో 22 ఏండ్ల కింద రాజేశ్ థియేటర్ నుంచి అడ్డగుంటపల్లి వరకు రోడ్డును విస్తరించారు. రహదారి మధ్యలో ఓ సివిల్ కాంట్రాక్టర్ తనకు పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించి తన బిల్డింగ్ వద్ద రహదారి విస్తరణ జరగకుండా చూశాడు. దీంతో ఈ ప్రాంతంలో రోడ్డు ఇరుగ్గా ఉండడంతో పాటు వాహనాలు తిరగడానికి ఇబ్బందిగా మారేది. ఈ బిల్డింగ్‌ను అధికారులు శనివారం కూల్చివేశారు.
కల్యాణ్‌నగర్, లక్ష్మీనగర్‌లో కూడా..
గోదావరిఖని కల్యాణ్‌నగర్ మెయిన్ సర్కిల్ విస్తరణకు, రోడ్డు నిర్మాణానికి ఓ మాజీ ప్రజాప్రతినిధికి చెందిన బిల్డింగ్‌గా అడ్డుగా ఉండేది. దీనిని తొలగించడానికి ఆఫీసర్లు ప్రయత్నించినా అవి ఫలించలేదు. ఈ విషయంలో ఓ మాజీ ఎమ్మెల్యేకు, సదరు మాజీ ప్రజాప్రతినిధికి మధ్య ఘర్షణ కూడా జరిగింది. అయినా ఆ బిల్డింగ్ తొలగలేదు. చివరకు మూడు రోజుల కింద రోడ్డుకు అడ్డంగా ఉన్న ఈ బిల్డింగ్ ముందు భాగాన్ని ప్రొక్లెయిన్‌తో తొలగించారు.
లక్ష్మీనగర్‌లో రీగల్ షూమార్టు వద్ద సర్కిల్ విస్తరణ కోసం త్వరలో మాజీ ప్రజాప్రతినిధికి చెందిన బిల్డింగ్‌ను కూల్చివేసేందుకు రంగం సిద్దం చేశారు. కాగా పట్టణంలోనే కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఇద్దరు మాజీ కార్పొరేటర్లకు చెందిన ఓ నిర్మాణాన్ని మూడు నెలల కింద కూల్చివేశారు. పలువురు తమ పలుకుబడితో, కోర్టు ద్వారా ఇన్నాళ్లూ తమ నిర్మాణాలను కాపాడుకున్నా.. ప్రస్తుతం మున్సిపల్ అధికారులు కూలుస్తుండడంతో ప్రజల నుంచి హర్షం
వ్యక్తమవుతోంది.