వాళ్ల ఒళ్లంతా రామనామమే..

వాళ్ల ఒళ్లంతా రామనామమే..

రాముడికి కష్టమొస్తే ఉడుత కూడా  సాయం చేసింది. రావణాసురుడిపై యుద్ధానికి వానరులు వారధి కట్టారు. రాముడి కోసం  ఎన్నో యేళ్లు పడిగాపులు కాసింది శబరి.  వీళ్ల అందరిదీ భక్తే. కానీ, ఒక్కొక్కరూ ఒక్కోలా చాటుకున్నారు. అచ్చు ఇలాగే తమ భక్తిని చాటుకోవడానికి శరీరం అంతా రామనామాన్ని పచ్చబొట్టు పొడిపించుకుంటారు చత్తీస్​గఢ్​లోని ఓ తెగ వాళ్లు. ఈ తెగని రామనామిలు అని కూడా పిలుస్తారు. కొన్ని వందల యేళ్ల నుంచి రామనామం పచ్చబొట్లని ఒంటిపై వేయించుకోవడం సంప్రదాయంగా కొనసాగిస్తున్న ఈ తెగపై స్పెషల్​ స్టోరీ. 

వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటుంది ఈ తెగ. మందు, సిగరెట్, మాంసాహారాలను అస్సలు ముట్టరు. రాత్రి భోజనాన్ని సాయంత్రం ఆరు లోపే ముగిస్తారు. ఎక్కువగా పళ్ళు , పాలు, పచ్చి కూరలు తింటారు. అలాగే ఏ పని చేయాలన్నా రామనామంతోనే  మొదలుపెడతారు వీళ్లు. 

ఛత్తీస్‍గఢ్‍  రాయగఢ్‍ జిల్లా సారంగఢ్‍ నందేలి అటవీ ప్రాంతంలో కొన్ని వందల యేళ్ల కిందట హరిజన తెగలు ఉండేవి. అప్పట్లో వాళ్లని అంటరాని వాళ్లుగా చూసేవాళ్లు.  ఈ తెగని గ్రామాల్లోకి రానిచ్చేవాళ్లు కాదు.  వాళ్లకి గుడుల్లోకి అనుమతి లేదు. మంచినీటి బావులు, చెరువుల్ని  తాకనిచ్చేవాళ్లు కాదు. దాంతో ఊరి బయట గుడిసెల్లోనే ఉండేది ఈ తెగ. అయితే వీళ్లకి రాముడంటే అపార భక్తి, ప్రేమ. కానీ, ఊరిజనం గుడిలోకి రానివ్వకపోవడంతో రాముడు ఆలయాల్లోనే కాదు తమలోనూ ఉన్నాడని ప్రపంచానికి చెప్పాలనుకున్నారు వాళ్లు. అంతే  రామనామాన్ని పచ్చబొట్లు పొడిపించుకోవడం మొదలుపెట్టారు. అలా చివరికి వాళ్ల తెగ పేరుని  కూడా ''రామనామి'' అని  పెట్టుకున్నారు. ఈ ఆచారాన్ని ఈ ప్రాంత వాసులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 

ఊరంతా ...
ఈ తెగలో చిన్నపిల్లల్ని నుంచి పండు ముసలివాళ్ల వరకు అందరూ రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు. కనురెప్పల్ని కూడా రామనామంతో నింపేస్తారు కొందరు. కాలి నుంచి తల వరకు పచ్చబొట్టు వేయించుకుంటే ‘‘నఖ్‍శిఖ్’’, నుదిటిపై మాత్రమే పొడిపించుకుంటే ''శిరోమణి”అని పిలుస్తారు.  కొందరు రామానామీలు  రామనామం ఉన్న బట్టలు వేసుకుని రోజూ భజన చేస్తారు. రాముడిపై ఇంత భక్తి ఉన్నా ఇప్పటికీ గుడి కట్టుకోలేదు ఈ తెగ. ఎందుకని అడిగితే  ‘‘మా దేహాన్నే మేము దేవాలయంగా భావిస్తాం’’ అని చెప్తుంటారు వీళ్లు. 

ప్రతి సంవత్సరం జనవరిలో ..
1911వ సంవత్సరంలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఆ టైంలో ఈ తెగంతా  పడవలో ప్రయాణం చేస్తోంది. అది కూడా మహానదిలో. వరద ఉధృతి  వల్ల పడవ ప్రయాణం కష్టమైంది వీళ్లకి. దాంతో మమ్మల్ని క్షేమంగా ఒడ్డుకు చేరిస్తే ప్రతీ సంవత్సరం ఘనంగా జాతర చేస్తామని రాముడికి మొక్కుకున్నారట వీళ్లు. అప్పట్నించీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 24 ,25 ,26 మూడు రోజులు పాటు జాతర చేస్తారు. ఈ జాతరకు రెండు నుంచి మూడులక్షల మంది భక్తులు వస్తారు. తులసీదాస్​ ‘‘రామచరిత మానస్‍’’లోని పంక్తులను చదువుతూ  రాముడికి  పూజ చేస్తారు. ఈ మేళాలో తమజాతికి చెందిన యువతీ, యువకులకు పెళ్లిళ్లు కూడా చేస్తారు. 
- మొబగాపు ఆనంద్​కుమార్​, భద్రాచలం, వెలుగు