చంద్రబాబు వ్యూహమే ఈ సినిమా : వర్మ

చంద్రబాబు వ్యూహమే ఈ సినిమా : వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వర్మ. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా విజయవాడలో డిసెంబర్ 23 శనివారం రోజుల వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లను చూసేందుకు ఇందిరా గాంధీ స్టేడియంకు వచ్చారు దర్శకుడు రాంగోపాల్ వర్మ, చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్. 

ఈ సందర్బంగా వ్యూహం సినిమా గురించి వర్మ మీడియాతో మాట్లాడారు.. జగన్ ఆలోచనా విధానం నచ్చింది కాబట్టే సినిమాలు తీస్తున్నాను అని అన్నారు. ఇక వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వైసీపీ పార్టీ నుండి నాయకులు ఎమ్మేల్యేలు వస్తున్నారు అని చెప్పిన ఆయన..  ఈ వ్యూహం రాజకీయ వ్యూహం గురించి తీయలేదు అన్నారు. వేరేవాళ్ళ మీద వ్యూహంతో తీశాం కానీ.. మా మీద మాకు వ్యూహం లేదని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఇటీవల జరిగిన చంద్రబాబు అరెస్ట్,వివేకా హత్య వంటి సన్నివేశాలతో పాటు.. పవన్ కళ్యాణ్, చిరంజీవి, షర్మిల, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాత్రలు కూడా ఉంటాయన్నారు. 

2009 నుంచి 2019 ఎన్నికల వరకు జగన్ మోహన్ రెడ్డికి సంబందించిన అన్ని విషయాలను ఈ సినిమాలో చూపిస్తున్నామని, మా సినిమాకు ఎన్నికల కోడ్ అడ్డురాదని చెప్పుకొచ్చారు. వ్యూహంకు కొనసాగింపుగా వస్తున్న శపధం జనవరిలో వస్తుందని, ఆ సినిమాలో జగన్ సీఎం అయ్యాక ఆయన ఫెయిల్యూర్స్, సక్సెస్ లు చూపిస్తామని చెప్పుకొచ్చారు.