
హైదరాబాద్, వెలుగు : ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రం. ఈ మాసమంతా ఉపవాసం ఉంటారు. అయితే ఈ ఏడాది రంజాన్ నెల మండు వేసవిలో వచ్చింది. ఉపవాసం చేయాలనుకునే డయాబెటిక్ పేషెంట్లకు ఇబ్బందులు తప్పేలా లేవు. సాధారణంగా డయాబెటిక్ పేషెంట్లు సరైన సమయానికి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వారి గ్లూకోజ్ స్థాయిలో హెచ్చు తగ్గులు నమోదవుతాయి. ఈ నేపథ్యంలో షుగర్ పేషెంట్లు ఉపవాసం చేయకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. లేదు ఉపవాసాలు తప్పకుండా చేయాల్సిందేనని భావిస్తే మాత్రం కచ్చితమైన, ముందస్తు ప్రణాళికతో పాటు వైద్యుల సూచనలను పాటిస్తూ చేయాలని సీనియర్ ఎండ్రోక్రినాలజిస్ట్ డాక్టర్ రవి శంకర్ చెబుతున్నారు.
రోజా ఉండే వారికి సూచనలు
ముందుగా వైద్యుడిని సంప్రదించి రంజాన్ ఉపవాసాలు చేయగలుగుతామో లేదో నిర్థారించుకోవాలి. అవసరమైన రక్త పరీక్షలు చేయించుకొని గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉందో లేదో తెలుసుకోవాలి. రంజాన్ ఉపవాసంలో భాగంగా నీళ్లు కూడా తాగరు. ఇది డీహెడ్రేషన్ కు దారితీసే అవకాశం ఉంది. కనుక చల్లని ప్రదేశాల్లోనే ఉండటం అవసరం. ఉపవాసం చేసే సమయంలో ఎస్ జీఎల్టీ-2 పేరుతో నోటితో తీసుకునే ఆహారాన్ని వాడొద్దు. ఇది తక్కువ గ్లూకోజ్ స్థాయికి చేర్చే ప్రమాదం ఉంది. ఇన్సులెన్ వాడుతున్న వారు ఉపవాసం చేస్తే బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎనలాగ్ ఇన్సులెన్స్ తో బ్లడ్ లో గ్లూకోజ్ స్థాయి పడిపోయే అవకాశాలు తక్కువ. అందువల్ల ఇన్సులెన్స్ తీసుకునే డయాబెటిక్ పేషెంట్లు ఇన్సులెన్ తీసుకోవటం ఆపొద్దు. జీఎల్పీ1, ఎగోనిస్ట్ లను ఇంజెక్షన్ రూపంలో వినియోగించవచ్చు. గ్లూకోజ్ పడిపోయే పరిస్థితికి దారితీసే హైపర్ గ్లైసేమియా బారిన పడకుండా ఇది సురక్షితంగా ఉంచుతుంది.
ఉపవాసం చేసేవారు తరచూ బ్లడ్లో గ్లూకోజ్ పర్సంటేజ్‌ను చెక్ చేసుకోవాలి. వైద్యుల సూచనలను పాటించాలి. ఉపవాసం ముంగించేప్పుడు అధిక కొవ్వు ఉన్న పదార్థాలు తీసుకోవద్దు. ఇది గ్లూకోజ్ ను తీవ్ర హెచ్చు తగ్గులకు గురిచేస్తుంది. ఒకటి, రెండు ఖర్జురాలను మాత్రమే తీసుకోవాలి. తక్కువ కొవ్వు కలిగిన పాలు, చిరుధాన్యాలు, గోధుమ రోటీలు తీసుకోవాలి. రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. వేయించనటువంటి చికెన్, ఫిష్తీసుకోవచ్చు. మామిడి పండ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవద్దు.