మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన పీరియాడికల్ చిత్రం 'కాంత' ( Kaantha). భారీ అంచనాలతో తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రమోషన్స్ తో అదరగొట్టారు. అయితే విడుదల కంటే ముందే ఈమూవీ న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంది. తమిళనాడులోని లెజెండరీ గాయకుడు-, నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ కుటుంబ సభ్యులు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ చిత్రంపై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రకటించిన డేట్ ప్రకారం రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.. .
న్యాయస్థానంలో భాగవతార్ కుటుంబం
'కాంత' చిత్రం తమ దివంగత కళాకారుడి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉందని త్యాగరాజ భాగవతార్ కుటుంబం పిటిషన్‌లో ఆరోపించారు. చిత్ర కథాంశం గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అలాగే కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకోలేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కారణంగా సినిమా విడుదలపై స్టే విధించాలని వారు కోరుతున్నారు. మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, చిత్రం నిర్మాతలకు, దుల్కర్ సల్మాన్‌కు నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి ఈ చిత్రం నవంబర్ 14న విడుదల కావాల్సి ఉండగా, ఈ న్యాయపరమైన అడ్డంకి కారణంగా విడుదల తేదీపై అనిశ్చితి నెలకొంది. ఈ కేసు విచారణను నవంబర్ 18వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
నిర్మాతలుగా రానా, దుల్కర్..
'కాంత' మూవీకి సెల్వమణి సెల్వరాజ్ రచన, దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా ఆయన తమిళ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారు . అంతకు ముందు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ 'ది హంట్ ఫర్ వీరప్పన్' తో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ కు చెందిన వేఫేరర్ ఫిల్మ్స్ , రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలుగా దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్, రానా దగ్గుబాటి, ప్రశాంత్ పోట్లూరి ఉన్నారు. 1950ల నాటి మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి, రవీంద్ర విజయ్, భాగవతి పెరుమాళ్, నిళల్‌గల్ రవి వంటి ప్రముఖ నటీనటులు నటించారు.
కథాంశం..
చిత్రంలో పాత్రల విషయానికొస్తే, సముద్రఖని ఒక దర్శకుడి పాత్రలో (అయ్య) కనిపిస్తుండగా, రానా దగ్గుబాటి ఒక పోలీసు అధికారిగా నటించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ కుమారి పాత్ర పోషించారు. సినిమా కథ ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ , సముద్రఖని పాత్రల మధ్య అహంకారం, ప్రతీకారం, తీవ్రమైన భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం 1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని ఉత్కంఠభరిత సంఘటనల ఆధారంగా ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించారని సమాచారం. 1940లలో మద్రాస్‌లో జరిగిన ఒక హత్య కేసులో భాగవతార్ ఇరుక్కున్న అంశాలు ఈ కథలో కీలకమవుతాయని టాక్. దుల్కర్ పాత్ర ఆనాటి ప్రముఖ నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ జీవితం నుంచి ప్రేరణ పొందిందని కూడా తెలుస్తోంది.
ఈ సినిమాతో వేఫేరర్ ఫిల్మ్స్ తొలిసారిగా మలయాళేతర నిర్మాణంలోకి అడుగుపెడుతూ, తమిళం, మలయాళం, తెలుగు, హిందీ మార్కెట్లలో తమ ఉనికిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేరళలో ఈ చిత్రాన్ని వేఫేరర్ ఫిల్మ్స్ ద్వారానే పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం కోర్టు కేసు కారణంగా 'కాంత' సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతోంది. నవంబర్ 18న విచారణ తర్వాతే ఈ సినిమా భవితవ్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
