మడగాస్కర్ను 30 ఏండ్లు ఏలిన మహారాణి రనవలోనా

మడగాస్కర్ను 30 ఏండ్లు ఏలిన మహారాణి రనవలోనా

‘మడగాస్కర్’​ అనగానే ఇప్పటి తరంలో చాలామందికి జంతువులతో తీసిన యానిమేషన్​ మూవీ గుర్తొస్తుంది. నిజానికి అదొక ఐలాండ్​. ఆఫ్రికాకు తూర్పున హిందూ మహాసముద్రంలో ఒంటరిగా కనిపిస్తుంది ఈ ద్వీప దేశం. ఈ దేశాన్ని ముప్పై మూడేండ్లపాటు ఏలిన మహారాణి రనవలోనా.  

మడగాస్కర్​లోని ఒక మారుమూల పల్లెలో 1788లో పుట్టింది రనవలోనా. చిన్నప్పుడు ఆమెను ‘రమావో’ అని పిలిచేవాళ్లు. తండ్రి రైతు. ఒకరోజు ఆయనకు అప్పటి రాజు ‘ఆండ్రియనమ్​పోయ్​నిమెరిన’ను హత్య చేయడానికి శత్రువులు చేసిన కుట్ర గురించి తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు. దాంతో రాజు అతన్ని మెచ్చుకొని బహుమతులు ఇచ్చాడు. అంతేకాదు, ‘రమావో’ను తన కొడుకు ‘రదామా’కు ఇచ్చి పెండ్లి చేశాడు. అయితే, ఎక్కడో మారుమూల పల్లె నుంచి వచ్చిన రమావోను పెండ్లి చేసుకోవడం రదామాకు ఇష్టంలేదు. అయినా, తండ్రి మాట కాదనలేక పెండ్లి చేసుకుంటాడు. కానీ, రమావోను సరిగా చూసుకునేవాడుకాదు.

రడామా చనిపోయాక రాణిగా..
రదామా1810లో రాజు అయ్యాడు. ఆ వెంటనే రమావో కుటుంబంలోని వాళ్లందరినీ చంపించాడు. మరో11 మందిని పెండ్లి చేసుకున్నాడు. కానీ,1828లో అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అందరూ రమావోను అనుమానించారు. తనే విషంపెట్టి చంపిందన్నారు. మరికొందరు మాత్రం అప్పటికే అంతుచిక్కని రోగంతో బాధపడుతున్న రదామా.. బాధ తట్టుకోలేక తానే కత్తితో గొంతు కోసుకున్నాడని అన్నారు. నిజానికి రడామా చనిపోయాక రమావో పిల్లలకే రాజు అయ్యే హక్కు ఉంది. కానీ, రమావోకు పిల్లలు లేకపోవడంతో అధికార పీఠంపై రదామా మేనల్లుడు ‘రకొటొబె’ కన్నేశాడు. సింహాసనం దక్కాలంటే రమావోను అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న రమావో వెంటనే మంత్రులు, సైన్యాధికారుల సాయంతో తనని రాణిగా ప్రకటించుకుంది. ఆ వెంటనే ‘రకొటెబె’తో సహా తన అధికారానికి అడ్డం వస్తారనుకునే వాళ్లందరినీ చంపించింది. 

వాళ్లెందుకు అండగా నిలిచారంటే..
రమావోకు మంత్రులు, సైన్యాధికారుల సాయం వెనక పెద్ద కారణమే ఉంది. ఆమె మామ అధికారంలో ఉండగానే మడగాస్కర్​కు బ్రిటన్​, ఫ్రాన్స్​ నుంచి కొంతమంది వలస వచ్చారు. వాళ్లు రాజును ఒప్పించి అక్కడ స్కూల్స్​ పెట్టారు. స్థానికులకు చదువు చెప్పేవాళ్లు. అయితే, స్కూల్స్​ పేరుతో తమ మతాన్ని స్థానికుల మీద రుద్దుతున్నారని రాజుకు ఫిర్యాదులు వెళ్లాయి. వాటిని ఆయన, ఆ తర్వాత పీఠం ఎక్కిన రదామా కూడా పట్టించుకోలేదు. పైగా బ్రిటీష్​, ఫ్రెంచ్​ వాళ్లతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. దాంతో మంత్రులు, సైన్యాధికారులకు రదామా మీద కోపం ఉండేది. అది తెలుసుకున్న రమావో.. మంత్రులు, సైన్యాధికారులతో మాట్లాడి, వాళ్లను తనవైపు తిప్పుకుంది. అలా వాళ్లు రమావోకు మద్దతుగా నిలిచారు.  

బ్రిటిష్​, ఫ్రెంచ్​ సేనలను తరిమింది
రాణి అయ్యాక రమావో తన పేరును ‘రనవలోనా’గా మార్చుకుంది. వలస వచ్చినవాళ్లు మడగాస్కర్​ కల్చర్‌‌కు ముప్పుగా తయారయ్యారని గ్రహించింది. వాళ్ల స్కూల్స్​కు అనుమతి రద్దు చేసింది. తిరిగి అనుమతి ఇవ్వాలంటే మడగాస్కర్​లో కంపెనీలు పెట్టాలనే షరతు పెట్టింది. అందుకు బ్రిటీష్​, ఫ్రెంచ్​ అధికారులు ఒప్పుకున్నారు. సబ్బులు, దుస్తులతోపాటు తుపాకులు, బుల్లెట్లు తయారుచేసే కంపెనీలు కూడా మొదలయ్యాయి. దాంతో యూరప్​ బయట ఇండస్ట్రియల్​ రెవల్యూషన్​ వచ్చిన దేశంగా మడగాస్కర్ నిలిచింది. అయితే, ఇది కేవలం కొన్ని నెలలు మాత్రమే. బ్రిటీష్​, ఫ్రెంచ్​ ప్రభుత్వాలు మడగాస్కర్​పై పట్టు కోసం మెల్లగా కుట్రలు మొదలుపెట్టాయి. అవి తెలిసి తాడోపేడో తేల్చుకోవాలనుకుంది రనవలోనా. అప్పటికే దొంగచాటుగా తీరంలో తిష్ట వేసిన ఫ్రెంచ్​ సైనికులను తరిమికొట్టింది. ​దేశంలో ఉన్న విదేశీయులందరినీ చంపేసింది. ఆ తర్వాత చాలాసార్లు బ్రిటీష్​, ఫ్రెంచ్ సైన్యం కలిసి మడగాస్కర్​పై దాడులు చేశాయి. కానీ, ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి రనవలోనా యుద్ధ వ్యూహాలు. రెండు మలేరియా. మడగాస్కర్​లో దోమల వల్ల మలేరియా బారిన పడి విదేశీ సైనికులు చాలా మంది చనిపోయారు.

అందుకే ఆ ముద్ర
‘నేను అమాయకురాలిని, బలహీనురాలిని కాదు. నేను నా దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రేమిస్తాను. వాటిని నాశనం చేసే ఏ పనైనా ఒప్పుకోను’.. రాణిగా ప్రమాణం చేశాక రనవలోనా చెప్పిన మాటలివి. అనడమే కాదు ఆ మాటకు జీవితాంతం కట్టుబడింది. దేశంపై విదేశాల పెత్తనం రాకుండా అడ్డుపడింది. తనను అధికారం నుంచి దించడానికి ఎవరు కుట్ర చేస్తున్నారని తెలిసినా నిర్దాక్షిణ్యంగా చంపించేది. అందుకే ఆమెకు రాక్షసరాణిగా, ‘పిచ్చి’ రాణిగా వెస్ట్రన్​ కంట్రీస్​ ముద్ర వేశాయి. కానీ, ఆమె తన దేశాన్ని విదేశాల బారి నుంచి రక్షించుకోవడానికే అలా చేసిందంటారు. అందుకే, ఆమె తను ఉన్నంతవరకు విదేశీ సైన్యాలను అడుగుపెట్టనివ్వలేదు. 1861లో ఆమె చనిపోయాక, మరో 30 ఏండ్లకే మడగాస్కర్​ను ఫ్రెంచ్​ సైన్యం ఆక్రమించుకుంది. ఆ తర్వాత 1960లో మళ్లీ  ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ, ఒకప్పుడు యూరప్​ తర్వాత పారిశ్రామిక విప్లవం​ వచ్చిన మొదటి దేశంగా రికార్డుకెక్కిన మడగాస్కర్​ ఇప్పుడు మాత్రం అత్యంత పేద దేశాల్లో ఒకటి.