ఇన్ ఫ్లూయెంజా వైరస్ కరోనా మాదిరిగానే వ్యాపిస్తుంది

ఇన్ ఫ్లూయెంజా వైరస్ కరోనా మాదిరిగానే వ్యాపిస్తుంది

హెచ్ 3 ఎన్2  ఇన్ ఫ్లూయెంజా  వైరస్ వ్యాప్తిపై ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. హెచ్ 3 ఎన్2  ఇన్ ఫ్లూయెంజా  వైరస్  కరోనా మాదిరిగానే వ్యాప్తించే  అవకాశం ఉందన్నారు. ప్రతి ఏడాది  సంవత్సరం ఇదే సమయంలో వైరస్ రూపాంతరం చెందుతూ వస్తోందన్నారు. కరోనా వలె ఇన్ ఫ్లూయెంజా వైరల్ తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

https://twitter.com/ANI/status/1632778676235280385

వైరస్ లక్షణాలు 

దేశంలో ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ ఫ్లూయెంజా వైరస్ సోకితే  జ్వరం, గొంతు నొప్పి, శరీరం నొప్పులు, ముక్కు నుంచి నీరు కారటం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఇన్ ఫ్లూయెంజా వైరస్ సోకిన  వారికి  ఐదు రోజుల పాటు  జ్వరం ఉంటుందన్నారు. గతంలో వచ్చిన H1N1 వైరస్ H3N2గా రూపాంతరం చెందిందన్నారు.  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ప్రజలు ఈ వైరస్ ఇన్ ఫెక్షన్ బారిన పడతారని డాక్టర్ గులేరియా హెచ్చరించారు. ఇన్ ఫ్లూయెంజా వైరస్ కేసుల సంఖ్య  పెరుగుతున్నా... ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. 

మాస్కు తప్పనిసరి..

హెచ్ 3 ఎన్2  ఇన్ ఫ్లూయెంజా  వైరస్  బారినపడకుండా ఉండాలంటే  మాస్కులను తప్పనిసరిగా ధరించాలని  గులేరియా  సూచించారు. చేతులు తరచుగా  శుభ్రం  చేసుకోవాలన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.