పాడె మోసి మాట నిలబెట్టుకున్న రణ్‌దీప్‌ హుడా 

పాడె మోసి మాట నిలబెట్టుకున్న రణ్‌దీప్‌ హుడా 

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు బాలీవుడ్ హీరో రణ్ దీప్ హుడా. సరబ్ జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ అంత్యక్రియల్లో పాల్గొని, ఆమె పాడె మోశాడు. ఈ సందర్భంగా దల్బీర్ కౌర్ తో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో ఉన్న భిఖివింద్‌లో సరబ్‌జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్ కౌర్‌ ఆదివారం (జూన్‌ 26) గుండెపోటుతో మరణించారు. దల్బీర్ కౌర్ అంత్యక్రియల్లో పాల్గొన్న బాలీవుడ్ హీరో రణ్ దీప్ హుడా ఆమె పాడెను మోసి, అంత్యక్రియలు నిర్వహించాడు. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణల కింద సరబ్‌జిత్‌ సింగ్‌కు పాకిస్తాన్‌ సుప్రీం కోర్టు మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. అతని బయోపిక్‌గా 2016లో తెరకెక్కిన 'సరబ్‌జిత్‌' సినిమాలో సరబ్‌జిత్‌ సింగ్‌ పాత్రలో రణ్‌దీప్ హుడా నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సరబ్‌జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్‌ కౌర్‌కు రణ్‌దీప్‌ హుడాకు మంచి అనుబంధం ఏర్పడింది.

రణ్‌దీప్‌ హుడాలో తన సోదరుడు సరబ్‌జిత్‌ సింగ్‌ను చూసుకుంటున్నట్లుగా దల్బీర్ కౌర్ అతనితో చెప్పింది. ఈ క్రమంలోనే రణ్‌దీప్‌ హుడాను దల్బీర్‌ కౌర్ ఒక కోరిక కోరింది.  తాను చనిపోయినప్పుడు ఆమెకు 'కంధ' (అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు భుజంపై పాడెను మోయడం) ఇవ్వాల్సిందిగా అడిగింది. ఆ హామీ మేరకు ఒక సోదరుడిలా దల్బీర్‌ కౌర్‌ దహన సంస్కరాలు నిర్వహించాడు రణ్‌దీప్‌. తన ఇన్‌స్టాగ్రామ్ లో దల్బీర్ కౌర్ చివరిసారిగా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ 'నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ, నేను వెళ్లేసరికి ఆమె వెళ్లిపోయింది. దల్బీర్‌ కౌర్‌జీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. ఆమె తన సోదరుడు సరబ్‌జిత్‌ సింగ్‌ను కాపాడుకునేందుకు ఎంతో పోరాటం చేసింది. ఆమె ప్రేమ, ఆశీర్వాదం నాపై ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. ఆమె కట్టిన రాఖీని నా జీవితంలో మర్చిపోలేను' అని ఎమోషనల్‌గా పోస్ట్ చేశాడు. 

ఎవరీ సరబ్ జిత్ సింగ్..? 
సరబ్‌జిత్ సింగ్ .. సొంతూరు పంజాబ్ రాష్ట్రంలోని భిఖివిండ్‌. ఈ ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది. వ్యవసాయం చేసుకుని జీవించే సరబ్‌జిత్ సింగ్.. ఒకరోజు అనుకోకుండా సరిహద్దు దాటాడు. దీంతో పాకిస్తాన్ అధికారులు ఆయనను ఓ గూఢాచారి అని కట్టుకథలు చెప్పి జైలులో వేశారు.  పాకిస్తాన్ కోర్టు ఆయనకు మరణ శిక్ష వేసింది. 1991 నుంచి 2013 వరకు సరబ్‌జిత్ సింగ్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో శిక్ష అనుభవించాడు. తన తమ్ముడుని విడుదల చేయించేందుకు సోదరి దల్బీర్ కౌర్ రాజీలేని పోరాటం చేశారు. ఆమె నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు. దల్బీర్ కౌర్ తమ్ముడు  సరబ్‌జిత్ సింగ్ విడుదల కోసం అలుపెరగకుండా శ్రమించారు. 

మరణ శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2013లో జైలులోనే కొందరు దుండగులు సరబ్‌జిత్ సింగ్‌పై దాడి చేశారు. తోటి ఖైదీల దాడిలో గాయపడ్డ సరబ్‌జిత్ సింగ్‌ను హాస్పిటల్ తీసుకెళ్లారు. తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. లాహోర్‌లోని జిన్నా హాస్పిటల్‌లో సరబ్‌జిత్ సింగ్ సుమారు 5 రోజుల పాటు కోమాలోనే ఉన్నాడు. ఆ తర్వాత అతడు మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.

సరబ్‌జిత్ సింగ్ పాకిస్తాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో22 ఏళ్ల పాటు దల్బీర్ కౌర్ తమ్ముడి విడుదల కోసం పోరాడారు. సరబ్‌జిత్ సింగ్ అమాయకుడని, అనుకోకుండానే సరిహద్దు దాటాడని ఆమె అధికారులకు చెబుతూనే వచ్చారు. తన సోదరుడిని చూడటానికి ఆమె పాకిస్తాన్ కూడా వెళ్లారు. సరబ్‌జిత్ సింగ్ మరణంపై దర్యాప్తు చేయాలని అప్పటి భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. దల్బీర్ కౌర్ కూడా ఇదే డిమాండ్ వినిపించారు. తన తమ్ముడు సరబ్‌జిత్‌పై దాడి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రణాళికనే అయితే దర్యాప్తు అవసరం లేదని, కానీ, అధికారులకు తెలియకుండా తన తమ్ముడిపై దాడి జరిగి ఉంటే మాత్రం కచ్చితంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.