ప్రభుత్వ భూమిలో గుడిసెల తొలగింపు.. ఉద్రిక్తత

ప్రభుత్వ భూమిలో గుడిసెల తొలగింపు.. ఉద్రిక్తత

రంగారెడ్డి జిల్లా : పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ కుంట్లూరు రావి నారాయణ రెడ్డి కాలనీలోని సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో వేలాదిగా గుడిసెలు వెలిశాయి. తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తూ..సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. ప్రభుత్వ భూమిలో ఒకేరోజు సుమారు 4000కుపైగా గుడిసెలు వేశారు. గత ఎనిమిదేళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం వేచి చూసినా.. ఇవ్వలేదని, దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో గుడిసెలు వేసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అద్దె ఇండ్లల్లో కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, అందుకే గుడిసెలు వేసుకున్నామంటున్నారు. 

ఉద్రిక్తత 

గుడిసెలు వేసిన వారిని పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో ఎవరు కూడా గుడిసెలు వేయకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. తక్షణమే గుడిసెలను తొలగించి.. అక్కడి నుండి వెళ్లిపోవాలని సూచించారు. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు.. సర్వే నెంబర్ 215 నుండి 224 వరకు ఉన్న భూమి ప్రభుత్వానిది కాదని, తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్థానిక సీపీఐ లీడర్లు చెబుతున్నారు. దాదాపు 100 ఎకరాల్లో ఉన్న భూదాన్ భూముల్లో నిరుపేదల కోసం ఇండ్ల స్థలాలు కేటాయించాలని రాష్ర్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.