ఒక్క సీటుతో.. లంక అధ్యక్షుడయ్యాడు

ఒక్క సీటుతో.. లంక అధ్యక్షుడయ్యాడు

శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ప్రస్తుతం దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయనకే పార్లమెంటు సభ్యులు పట్టం కట్టారు. ఇవాళ లంక పార్లమెంటులో జరిగిన పోలింగ్ లో ఆయనకే అత్యధిక ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో రణిల్ విక్రమ సింఘేకు అధ్యక్ష పీఠం ఖాయమైంది.పార్లమెంటులో మొత్తం 219 మంది ఎంపీలు ఉండగా, 134 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 8వ లంక అధ్యక్షుడిగా రణిల్ ను అవకాశం వరించింది. 

ఎస్ఎల్పీపీ ఎంపీలంతా రణిల్ వైపే..

గొటబాయ రాజపక్స ప్రాతినిధ్యం వహించే ఎస్ఎల్పీపీ పార్టీకి చెందిన ఎంపీలంతా రణిల్ కే ఓటు వేశారు. దీంతో ఈ విజయం సాధ్యమైంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మరో అభ్యర్థి, ఎస్ఎల్పీపీ చీలిక వర్గం నాయకుడు దుల్లాస్ అలహప్పేరుమకు 54  ఓట్లే  వచ్చాయని తెలుస్తోంది. ప్రజానిరసనలతో గొటబాయ రాజపక్స సింగపూర్ కు పరారయ్యారు. దీంతో ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి రణిల్ ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్ష పదవిలో 2024 నవంబరు వరకు కొనసాగనున్నారు. లంక పార్లమెంటు సభ్యులు తమ దేశాధ్యక్షుడిని నేరుగా ఎన్నుకోవడం 44 ఏళ్లలో ఇదే తొలిసారి. 

ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవకపోయినా.. 

రణిల్ విక్రమ సింఘేకు ఒక రాజకీయ పార్టీ ఉంది. దానిపేరు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) . శ్రీలంకలో 2020లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూఎన్పీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే, మొత్తం ఓట్ల ఆధారంగా ఆ పార్టీకి కేటాయించిన ఒక సీటుతో విక్రమ సింఘే పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. ఇలా పార్లమెంటుకు నామినేట్ అయిన రణిల్.. దేశ అధ్యక్ష స్థానానికి ఎంపికవడం విశేషం. రణిల్ కు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయన శ్రీలంకకు ఆరుసార్లు ప్రధానమంత్రిగా వ్యవహరించారు. రాజకీయాల్లోకి రాకముందు జర్నలిస్టు, న్యాయవాదిగా పనిచేశారు. 1977లో సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా రణిల్  పార్లమెంటు సభ్యుడు అయ్యారు. 1993లో తొలిసారి ప్రధాని అయ్యారు.