భూములు ఇచ్చిన వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం

భూములు ఇచ్చిన వారికి పునరావాసం కల్పించడంలో  ప్రభుత్వాలు విఫలం

ఆసిఫాబాద్, వెలుగు:  కుమ్రంభీం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన వారికి పునరావాసం కల్పించడంలో దశాబ్దాలు గడుస్తున్నా ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. 2005లో పెద్ద వాగుపై కుమ్రంభీం ప్రాజెక్టును నిర్మించారు.  దీని కోసం కెరమెరి మండలం రాంజీగుడా గ్రామానికి చెందిన 51 గిరిజన కుటుంబాల రైతులు భూములు ఇచ్చారు.  కానీ నేటికీ వారికి పునరావాసం కల్పించ లేదు. దీంతో వారు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల  నిత్యం పాములు, తేళ్లతో సావాసం చేస్తూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

 ప్రాజెక్ట్  కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు దశాబ్దాల నుంచి పునరావాస ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.  ప్రభుత్వాలు మారుతున్న వారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఆదుకోవాల్సిన పాలకులు, ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. అయితే రాంజీగూడ గ్రామ ప్రజలకు ధనోర గ్రామ సమీపంలో  పునరావాసం కోసం స్థలం కేటాయించారు. అక్కడ చేపట్టిన పునరావాస పనులు ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి.  ముంపునకు గురైన ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో గిరిజన ప్రజలు  గోస పడుతున్నారు.

పెండింగ్ లోనే పనులు...

51కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు గవర్నమెంట్ ధనోర గ్రామ సమీపంలో 5.9 ఎకరాలు కేటాయించింది. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు2016 మార్చిలో రూ. 2.55 కోట్ల  నిధులు మంజూరు చేశారు. 74 మందికి ఆఫీసర్లు ప్లాట్లు ఇచ్చారు. అయితే ఆ ప్రాంతంలో మౌలిక సౌకర్యాల కల్పన మాత్రం మరిచారు.    ఇప్పటి వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రాథమిక పాఠశాల భవనం మాత్రమే నిర్మించారు. మిగతా పనులు ఇంకా మొదలు పెట్టలేదు.  ఓఆర్ఎస్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, గుడి, గిరిజన ఆశ్రమ హైస్కూల్ ​నిర్మించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఏటా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.  

నిధుల కొరతతో  పనులు కంప్లీట్ చేయట్లే

రాంజీగుడా గిరిజన ప్రజలకు ధనోర సమీపంలో పునరావాసం కోసం ప్లాట్లు పంపిణీ చేశాం. సీసీ  రోడ్డు, డ్రైనేజీ నిర్మించినం. గిరిజన ఆశ్రమ హైస్కూల్ బిల్డింగ్, వాటర్ ట్యాంక్, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు లేక పనులు పెండింగ్ లో ఉన్నాయి. నిధులు రాగానే పనులు షురూ చేసి పునరావాసం కల్పిస్తాం. 
 - జాడి రాజేశ్వర్, డీఆర్వో, ఆసిఫాబాద్

గోస పడుతున్నం

పునరావాసం కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారు.  పునరావాసం కల్పించాలని ఆఫీసర్లకు, లీడర్లకు ఎన్నోసార్లు వినతిపత్రం ఇచ్చిన. అయినా పట్టించుకోవడం లేదు. పునరావాసం లేక, ఉన్న ఊర్లో డెవలప్ మెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆశ్రమ పాఠశాల, కరెంట్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం, నల్లాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలి. మరో నెల రోజులైతే వర్షాకాలం వస్తది. ఇప్పటికైనా గవర్నమెంట్ వెంటనే పనులు షురూ చేసి పూర్తి స్థాయిలో  పునరావాసం కల్పించాలి.
-‌‌ అనక దేవ్ రావ్​, రాంజీగూడ