Ranveer Singh: రూ.1100 కోట్లు దాటిన రణవీర్ 'ధురందర్' వసూళ్లు.. పఠాన్, పుష్ప 2 రికార్డులు బద్ధలు!

Ranveer Singh:  రూ.1100 కోట్లు దాటిన రణవీర్ 'ధురందర్' వసూళ్లు.. పఠాన్, పుష్ప 2 రికార్డులు బద్ధలు!

ఇండియన్ సినీ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఒకే పేరు మారుమోగుతోంది. అదే రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్'. ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. డిసెంబర్ 5, 2025న విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన నాలుగు వారాలు గడుస్తున్నా.. ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కలెక్షన్ల సునామీ..

లేటెస్ట్ గణాంకాల ప్రకారం.. నాలుగో వారం గురువారం నాడు కూడా ఈ చిత్రం ఇండియాలో రూ. 17.60 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా మొత్తం దేశీయ వసూళ్లు రూ. 784.50 కోట్లకు చేరుకున్నాయి. కేవలం సింగిల్ లాంగ్వేజ్‌లో (హిందీ) అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'ధురందర్' సరికొత్త చరిత్ర సృష్టించింది. రిలీజ్ అయిన తొలి రోజు నుంచి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ALSO READ :  'రంగస్థలం' మ్యాజిక్ రిపీట్

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ రికార్డులు.. 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రభంజనం మామూలుగా లేదు. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,125 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో విదేశీ మార్కెట్ (Overseas) వాటానే రూ. 250 కోట్లకు పైగా ఉంది. ఈ వసూళ్లతో 'ధురందర్' భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన 7వ చిత్రంగా నిలిచింది. 'స్త్రీ 2', 'ఛావా', 'పఠాన్', ఇటీవలి సెన్సేషన్ 'పుష్ప 2' కలెక్షన్లను కూడా ఈ సినిమా వెనక్కి నెట్టివేసింది.

 

నార్త్ అమెరికాలో 'పఠాన్' రికార్డు బద్ధలు

నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా రణవీర్ తన సత్తా చాటారు. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' పేరిట ఉన్న రికార్డును ధురందర్ అధిగమించింది. అక్కడ 17.50 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో 'బాహుబలి 2', 'కల్కి 2898 AD' వంటి తెలుగు పాన్-ఇండియా చిత్రాలు ఉండగా, హిందీ చిత్రం పరంగా 'ధురందర్' అగ్రస్థానంలో నిలిచింది.

పోటీలో నిలవలేకపోయిన ఇతర సినిమాలు


ధురందర్ ధాటికి బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాలు కనుమరుగవుతున్నాయి. కపిల్ శర్మ నటించిన 'కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే నటించిన 'తు మేరీ మైన్ తేరా..' కూడా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకోవడంలో విఫలమైంది. అయితే లేటెస్ట్ గా విడుదలైన అగస్త్య నంద చిత్రం 'ఇక్కిస్' (Ikkis) కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ధురందర్ వేవ్ ఉన్నప్పటికీ, ఈ సినిమా ఏ మేరకు నిలబడుతుందో వేచి చూడాలి.

ఆదిత్య ధర్ విజువల్స్, రణవీర్ సింగ్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. రణవీర్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచిన 'ధురందర్', మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోందని సినీ  ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.