
హనుమకొండ, వెలుగు: వరంగల్ మెడికవర్ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించి, పేషెంట్ చేతిని కాపాడినట్లు హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ వ్యాస్కులర్ సర్జన్ డా.రవి కిరణ్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డా.ప్రియాంక తెలిపారు. హంటర్ రోడ్డులోని వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు.
తిరుపతి అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్ తో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారని, డిశ్చార్జ్ అయిన రోజు నుంచే కుడి చేతిలో రక్త ప్రసరణ నిలిచిపోయి విపరీతమైన నొప్పితో మెడికవర్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడన్నారు. అతడికి పరీక్షలు నిర్వహించి, యాంటీపాస్పోలిపిడ్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో కుడి చేయి రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టి సమస్య ఏర్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆపరేషన్ నిర్వహించి, పేషెంట్ చేతిని కాపాడినట్లు తెలిపారు.