
ఏ హీరోయిన్ కూడా గ్లామర్ పాత్రలకి పరిమితమైపోవాలని అనుకోదు. తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునే అవకాశాలు రావాలని ఆశపడుతుంది. రాశీఖన్నా కూడా అంతే. చాలాకాలం పాటు హీరో పక్కన కనిపించే మామూలు హీరోయిన్ పాత్రలే చేసిందామె. కానీ ఇప్పుడు తానేంటో చూపించే చాన్సెస్ దొరుకుతున్నందుకు ఆనందంగా ఉందంటోంది. ఈమధ్యనే అజయ్ దేవగన్ లీడ్ రోల్ చేసిన ‘రుద్ర’ వెబ్ సిరీస్‌లో నటించింది రాశి. మూడు హత్యలు చేసి, పోలీసుల్ని మాయ చేసి తప్పించుకునే ఇంటెలిజెంట్ గాళ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది. రీసెంట్‌గా దీని విషయమై మాట్లాడింది. ‘నా పాత్రకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. ప్రేక్షకులు ఓటీటీలో వచ్చే డిఫరెంట్ కంటెంట్‌ని చాలా ఇష్టపడుతున్నారు. అందుకే నేను అటువైపు అడుగులు వేశాను. మూస పద్ధతుల్ని బ్రేక్ చేయాలి. రొటీన్ క్యారెక్టర్స్‌కి దూరంగా ఉండాలి. డ్యూయెట్లలోను, రొమాంటిక్ సీన్స్‌లోను కనిపించే గ్లామర్ డాల్‌ని కాలేను నేను. మంచి నటిని అనిపించుకునే పాత్రలే చేస్తాను. స్ట్రాంగ్‌గా ఉండే క్యారెక్టర్‌లో పది నిమిషాలు కనిపించినా చాలు అనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. నిజానికి స్క్రిప్ట్ రైటర్ అవుదామనుకుని హీరోయిన్ అయ్యిందట రాశి. నటి అయినందుకు ఇన్నాళ్లకి శాటిస్ఫై అవుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం షాహిద్ కపూర్, విజయ్ సేతుపతితో కలిసి ఓ వెబ్ సిరీస్ చేస్తున్న రాశి.. సర్దార్, యోధ, సైతాన్ కా బచ్చా, పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది.