
అతి తక్కువ కాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న రష్మిక మందాన్నా.. ప్రస్తుతం బాలీవుడ్‌లో పాగా వేసే ప్రయత్నాల్లో ఉంది. మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ చిత్రాలకు బ్యాక్ టు బ్యాక్ కమిటయ్యింది. ‘యానిమల్’ షూటింగ్ ఈమధ్యనే మొదలయ్యింది. దాంతో ఆ విశేషాలను పంచుకుంది రష్మిక. ముఖ్యంగా హీరో రణ్‌బీర్ కపూర్‌ని చాలా పొగిడేస్తోంది. అతనితో పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉందని, చాలా మంచి వ్యక్తి అని మెచ్చుకుంటోంది. ‘రణ్‌బీర్ అందరికీ చాలా గౌరవం ఇస్తాడు. ఇండస్ట్రీలో నన్ను మేడమ్ అని పిలిచేది రణ్‌బీర్ ఒక్కడే. కానీ నాకది నచ్చడం లేదు. దీని గురించి అతనితో తేల్చుకుంటా’ అంటోంది నవ్వుతూ. ఇక విజయ్‌తో చేస్తున్న బైలింగ్వల్ మూవీ గురించి కూడా మాట్లాడింది. ఇందులో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్‌గా, చాలెంజింగ్‌గా ఉంటుందట. తన కోసం, తన వాళ్ల కోసం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి రెడీ అయ్యే అమ్మాయిగా కనిపిస్తుందట. ఇక రష్మిక కీలక పాత్ర పోషించిన ‘సీతారామం’ ఆగస్ట్ 5న విడుదల కానుంది. ‘పుష్ప2’ అతి త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది.