
‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయింది రష్మిక. నిజానికి ఈ సినిమాకి ముందే ఆమెకి హిందీలోనూ చాన్సెస్ వచ్చాయి. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న ఆమె, మరోవైపు అమితాబ్‌తో కలిసి ‘గుడ్ బై’ చిత్రంలోనూ నటిస్తోంది. దీంతో బీటౌన్‌లో రష్మిక బాగా పాపులర్ అయ్యింది. ఇతర ఫిల్మ్ మేకర్స్ నుంచి కూడా అవకాశాలు అందుకుంటోంది. ఆల్రెడీ ఆమె వరుణ్ ధావన్‌తో ఓ ప్రాజెక్ట్‌కి కమిటైనట్లు వార్తలు వస్తున్నాయి. అంతలోనే రణబీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘యానిమల్’ కోసం రష్మికని కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అనిల్ కపూర్, బాబీడియోల్, పరిణీతి చోప్రా లాంటి భారీ స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. అతనే ఈ ప్రెస్టీజియస్ మూవీలో స్పెషల్ సాంగ్ చేయమని రష్మికను అడిగాడట. ఇటీవల ‘పుష్ప’లో సామి పాటకు రష్మిక చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. అందువల్లే ఈ అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె ఓకే చెప్పిందా లేదా అనేది త్వరలో తెలుస్తుంది. నిజానికి ఇటీవల ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో స్పెషల్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి అందుకు సిద్ధంగా లేనని, ఆ టైమ్ వచ్చినప్పుడు ఆలోచిస్తానని చెప్పింది రష్మిక. మరి సమంతలాగా ఊ అంటుందో.. లేక ఊహూ అంటుందో!