ఎయిరిండియా ప్రయాణికులకు రతన్ టాటా స్పెషల్ మెసేజ్

ఎయిరిండియా ప్రయాణికులకు రతన్ టాటా స్పెషల్ మెసేజ్

దాదాపు 69 ఏండ్ల తర్వాత సొంత గూటికి చేరిన ఎయిరిండియా సంస్థ గత వారం అధికారికంగా టాటా గ్రూప్‌లో భాగమైంది. ఎట్టకేలకు టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా నెరవేరింది. తన తండ్రి స్థాపించిన సంస్థను మళ్లీ చేజిక్కించుకుని విమానాలను నడుపుతున్నారు. ఈ సందర్భంగా ఎయిరిండియాలో ప్రయాణించే వారికి తన వాయిస్‌తోనే వెల్‌కమ్‌ చెప్పారాయన. 18 సెకన్ల వాయిస్ మెసేజ్‌తో ఎయిరిండియా ప్రయాణికులకు స్వాగతం చెప్పారు. దానిని ఎయిరిండియా తన  అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘‘ఎయిరిండియా కొత్త కస్టమర్లకు టాటా గ్రూప్ వారి స్వాగతం.. ప్రయాణికుల కంఫర్ట్, సర్వీసుల పరంగా చూసి, విమాన ప్రయాణానికి ఒక ఎయిర్‌‌లైన్స్‌ను చాయిస్‌గా ఎంపిక చేసుకోవాల్సి వస్తే అది ఎయిరిండియానే అయ్యేలా కృషి చేసేందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాం” అని ఆ వాయిస్‌ మెసేజ్‌లో రతన్‌ టాటా చెప్పారు.

బిడ్ ఖరారైన రోజున ఎమోషనల్ ట్వీట్

ఎయిరిండియా ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో అందరి కంటే ఎక్కువగా రూ.18 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసి టాటా గ్రూప్ ఈ సంస్థను సొంతం చేసుకుంది. టాటా గ్రూప్​లోని ఒక సబ్సిడరీ కంపెనీ తలేస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఈ బిడ్​ను దాఖలు చేసింది. దీంతో కిందటేడాది అక్టోబర్​ 8న ఈ కంపెనీకే ఎయిర్​ ఇండియా దక్కినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన రోజున కూడా రతన్ టాటా చాలా ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘గ్రేట్ న్యూస్‌.. ఎయిరిండియాను టాటా గ్రూప్  దక్కించుకుంది! ఎయిరిండియా పునర్నిర్మాణం కోసం గట్టి కృషి చేయాల్సి ఉంది. ఏవియేషన్ ఇండస్ట్రీలో టాటా గ్రూప్‌ మంచి మార్కెట్‌ను సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నా” అని రతన్ టాటా అన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఎయిర్‌‌లైన్స్‌గా తన తండ్రి జేఆర్డీ టాటా నాయకత్వంలో నడిచిందని ఆయన గుర్తు చేశారు. ఆ ఇమేజ్‌ను మళ్లీ సొంతం చేసుకునే అవకాశం టాటాలకు తిరిగి దక్కిందని అన్నారు. ఈ సమయంలో జేఆర్డీ టాటా మన మధ్య ఉండుంటే ఆయన ఎంతో సంతోషించేవారంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. మళ్లీ తమ చేతిలోకి ఈ కంపెనీ వచ్చేందుకు వీలుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆయన ఆ రోజు ధన్యవాదాలు తెలిపారు.

స్వాతంత్ర్యానికి పూర్వం జేఆర్డీ టాటా పెట్టిన కంపెనీ

ఎయిర్ ఇండియాను 1932లో జేఆర్‌డీ టాటా స్థాపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  విమానయాన రంగాన్ని జాతీయం చేయడంతో ఎయిర్ ఇండియాలో టాటా ఎయిర్‌లైన్స్‌కు ఉన్న 49 శాతం వాటాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ఆ తర్వాత కంపెనీని అప్పటి సర్కార్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చింది. దీంతో సంస్థ పేరును ఎయిర్ ఇండియాగా పేరు మార్చారు. 1953 లో ప్రభుత్వం ఎయిర్ కార్పొరేషన్ చట్టాన్ని ఆమోదించింది. కంపెనీ వ్యవస్థాపకుడు జేఆర్‌డీ టాటా నుంచి యాజమాన్య హక్కులను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ తర్వాత కంపెనీకి మళ్లీ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. ఇంత కాలం తర్వాత మళ్లీ ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తల కోసం..

చైనా ఆర్మీ నాకు కరెంట్ షాక్ ఇచ్చింది

 

సైకిల్‌పై పార్లమెంట్‌కు కేంద్ర మంత్రి

2020లో కొవిడ్ కేసుల కంటే ఈ 10 వారాల్లో వచ్చినవే ఎక్కువ