యాదగిరిగుట్టలో వైభవంగా రథసప్తమి వేడుకలు

యాదగిరిగుట్టలో  వైభవంగా రథసప్తమి వేడుకలు
  • సూర్యప్రభ వాహనం, స్వర్ణరథంలో విహరించిన నారసింహుడు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం  లక్ష్మీనరసింహుడిని వజ్ర వైఢూర్యాలు, బంగారు ఆభరణాలతో ముస్తాబు చేసి ప్రభాతవేళలో  సూర్యప్రభ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.

ఊరేగింపు అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట స్వామివారిని అధిష్టింపజేసి చతుర్వేద పారాయణాలు గావించారు.  సాయంత్రం నారసింహుడిని స్వర్ణరథంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు రథసప్తమి విశిష్టతను భక్తులకు ప్రవచించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్, ఏఈవో రామ్మోహన్, సూపరింటెండెంట్ దొమ్మాట సురేందర్ రెడ్డి, డంగు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

పాతగుట్టలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పూర్వగిరి(పాతగుట్ట) నరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండోరోజైన శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథీఘల్, కాండూరి ఆధ్వర్యంలో ‘తిరుమంజనం’ వేడుకను  నిర్వహించారు. సాయంత్రం దివ్యప్రబంధ సేవాకాలం ఉత్సవాన్ని నయనానందకరంగా జరిపించారు.

స్వామిఅమ్మవార్లను  పూలతో సర్వాంగ అలంకరించి ఆలయ తిరువీధుల్లో విహరింపజేసి ‘పురప్పాట్టు సేవ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఏఈవో గజవెల్లి రమేశ్​ బాబు, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

 పాతగుట్ట బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌‌ను శుక్రవారం ఆలయ చైర్మన్ నరసింహమూర్తి, ఈవో రామకృష్ణారావు ఆవిష్కరించారు. ఈ నెల 19న స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.  

22న తిరుకల్యాణం, 23న దివ్యవిమాన రథోత్సవం నిర్వహిస్తారు.  25న అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకనున్నారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్, ఏఈవో గజవెల్లి రమేష్ బాబు, శ్రావణ్ కుమార్, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరదింహాచార్యులు, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, నగేశ్, నరేష్, శ్రీకాంత్, ఇంజినీరింగ్ డీఈ మహిపాల్ రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.