న్యూస్​ చానెళ్లకు 3 నెలలు రేటింగ్స్ బంద్

న్యూస్​ చానెళ్లకు 3 నెలలు రేటింగ్స్ బంద్

ముంబయి: జాతీయ, ప్రాంతీయ న్యూస్​ చానెళ్లకు టీఆర్పీలు తాత్కాలికంగా బందయ్యాయి. రేటింగ్‌లను 12 వారాల పాటు నిలిపేయాలని డేటా ప్రకటించే బార్క్ (బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్) సంస్థ బోర్డు నిర్ణయించింది. ప్రతి గురువారం వీక్లీ రేటింగ్స్ ను బార్క్ రిలీజ్ చేస్తుంది. ఈ మధ్య ముంబైలో బార్క్ రేటింగ్ మీటర్లను కొందరు అక్రమంగా మేనేజ్ చేస్తున్నట్లు పోలీసులు కేసు పెట్టడం వివాదం రేపింది. ఈ నేపథ్యంలో లోపాలను సరిదిద్దుకునే చర్యలను బార్క్ మొదలుపెట్టింది. డేటా సేకరణలో ప్రమాణాలను టెక్నికల్ కమిటీతో సమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇళ్లలో మీటర్లను మేనేజ్ చేసే అక్రమాలను నివారించి, రేటింగ్ లో కచ్చితత్వాన్ని పెంచడమే ఈ నిర్ణయం ఉద్దేశమని చెప్పింది. హిందీ, ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, బిజినెస్ వార్తల చానెళ్లకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది. అయితే రాష్ట్రాలు, భాషలవారీగా న్యూస్ కేటగిరీకి వచ్చే మొత్తం రేటింగ్‌ను మాత్రం ప్రకటిస్తామని చెప్పింది. టెక్నికల్ కమిటీ పర్యవేక్షణలో రేటింగ్ డేటా వాలిడేషన్, టెస్టింగ్ ప్రాసెస్ కు 8 నుంచి 12 వారాలు పడుతుందని బార్క్ పేర్కొంది.

సంస్కరణలు రావాల్సిందే

బార్క్ నిర్ణయాన్ని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్.బి.ఎ.) సమర్థించింది. రేటింగ్ డేటా విశ్లేషణలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని చెప్పింది. ఇండస్ట్రీ సరైన దిశలో సాగడానికి ఇది కీలక నిర్ణయమని అభిప్రాయపడింది. సిస్టం మొత్తాన్ని పూర్తిగా మార్చి, నమ్మకమైన రేటింగ్స్ ఇవ్వడానికి ఈ టైంను వాడుకోవాలని సూచించింది. డేటాలో అక్రమాలు, విపరీతమైన హెచ్చుతగ్గుల వల్ల రేటింగ్ విశ్వసనీయత దెబ్బతిందన్నారు. ఎన్.బి.ఎ. ప్రెసిడెంట్ రజిత్ శర్మ. బార్క్ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం వల్ల చానెళ్ల కంటెంట్ మెరుగయ్యే అవకాశం ఉందన్నారు. బార్క్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్.బి.ఎఫ్.) అభ్యంతరం చెప్పింది.

లోపాలు నిజం.. మార్పు అవసరం

ముంబైలో టీఆర్పీ మానిప్యులేషన్ కేసులో ప్రముఖ చానెళ్ల పేర్లు రావడం, మీటర్లను నిర్వహించే ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఉండడం వివాదం రేపింది. ఈ మధ్యే హిందీ న్యూస్ రేటింగ్స్ డేటాలో విపరీతమైన హెచ్చుతగ్గులు ఉండడంపై పలు చానెళ్లు బార్క్ కు ఫిర్యాదు చేశాయి. ఈ లోపాలను బార్క్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఇప్పుడు మొదటిసారి రేటింగ్ మీటర్ల మానిప్యులేషన్ జరుగుతున్నట్లు అంగీకరించింది. ఏకంగా మూడునెలల పాటు రేటింగ్ ను బందు పెట్టి సిస్టంను మెరుగ్గా మారుస్తామని చెబుతోంది.

ఇది అవసరమైన బ్రేక్

‘‘బార్క్ ఇప్పటికే కఠినమైన ప్రొటోకాల్ ను పాటిస్తోంది. అయితే దీన్ని సమీక్షించుకోవడానికి కాస్త పాజ్ అవసరమని బోర్డు భావిస్తోంది. దీన్ని మరింత మెరుగుపరచడమే మా లక్ష్యం. ఇది ఇండస్ట్రీ ఎదగడానికి, సరైన పోటీతత్వాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది.’’ -పునీత్ గోయెంకా, బార్క్ చైర్మన్

అక్రమాల్ని నిరోధిస్తాం

ఇండియా ఏం చూస్తోందో చెప్పే రేటింగ్ లను కచ్చితంగా అందించడం మా బాధ్యత. ఇప్పుడున్న ప్రొటోకాల్ ని మరింత మెరుగుపరిచి గ్లోబల్ స్టాండర్డ్స్ స్థాయికి తీసుకెళతాం. దీంతో పాటు ప్యానెల్స్ ఉన్న ఇండ్లను మేనేజ్ చేసే అక్రమాలను అడ్డుకోవడానికి మేం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం. వ్యూయర్ షిప్ అక్రమాలపై కోడ్ ఆఫ్ కాండక్ట్ ను మరింత కఠినంగా మారుస్తాం. -సునీల్ లుల్లా, బార్క్ సీఈవో