దరఖాస్తులు తీస్కునుడు పక్కకు పడేసుడు

దరఖాస్తులు తీస్కునుడు పక్కకు పడేసుడు

41.61 లక్షల అప్లికేషన్లు పెండింగ్
పథకాల కోసం హడావుడిగా దరఖాస్తుల స్వీకరణ
తర్వాత పట్టించుకోని సర్కారు
ఆసరాకు 3 సార్లు దరఖాస్తులు.. ఒక్కరికీ పెన్షన్ ఇయ్యలే
ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌‌కు గైడ్‌‌లైన్స్ కూడా రాలే
పోడు సమస్యపై ఉత్తముచ్చట్లే.. గిరిజనుల గోడు తీరలే

రేషన్​ కార్డుల కోసం నిరీక్షణ
రాష్ట్రంలో రేషన్‌‌ కార్డులకు నిరీక్షణ తప్పడంలేదు. ఏడు లక్షల రేషన్‌‌ కార్డు దరఖాస్తులు ఉండగా, గతేడాది 3.10 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక సందర్భంగా వీరికి రేషన్‌‌ కార్డులు మంజూరు చేశారు. మిగతా 3.90 లక్షల దరఖాస్తులను కనీసం పరిశీలించకుండానే రిజెక్ట్‌‌ చేశారు. గత జూన్‌‌ నుంచే మీసేవలో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా సర్కార్​ తొలగించింది. రాష్ట్రంలో 2014 నుంచి 19 లక్షల రేషన్‌‌ కార్డులను తొలగించారు. ఎలాంటి పరిశీలన లేకుండా, కార్డుదారులకు నోటీసులు ఇవ్వకుండా బోగస్‌‌ కార్డుల పేరుతో తొలగించారు. 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో మొత్తం 41.61 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌‌లో మూలుగుతున్నాయి. రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందనే కారణంతో కొన్ని స్కీంలను పెండింగ్‌‌లో పెట్టిన సర్కారు.. డబ్బుతో సంబంధం లేని ఇతర అంశాలను కూడా ఇదే గాటన కట్టేసింది. ప్రభుత్వ తీరుతో స్కీంలు అందక, సమస్యలు పరిష్కారం కాక జనం అరిగోస పడుతున్నారు. ఆసరా పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13.70 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. అప్లికేషన్లకు మూడు దఫాలుగా గడువు పొడిగించిన సర్కారు.. పెన్షన్లను మాత్రం ఇప్పటిదాకా ఇవ్వలేదు. పింఛన్ వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని గతేడాది సీఎం కేసీఆర్‌‌ ప్రకటించారు. సర్కారు జీవో కూడా జారీ చేసింది. మీ సేవ ద్వారా అప్లికేషన్లు తీసుకున్నారు. ఇందులో పదిన్నర లక్షల మంది అప్లై చేసుకున్నారు. అంతకుముందే 65 ఏండ్లు పైబడిన వాళ్లు 3 లక్షల మందికి పైగా అప్లై చేసుకుని ఎదురుచూస్తున్నారు. వీటిని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో ఇతర ఆఫీసర్లు ఎప్పటికప్పుడు వెరిఫై చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆన్‌‌లైన్‌‌లో ఈ అప్లికేషన్లు అప్రూవ్డ్‌‌గా చూపిస్తున్నా పెన్షన్‌‌ రావడంలేదు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు తదితర వర్గాలకు తిప్పలు తప్పడంలేదు. ఇప్పటికే నాలుగు లక్ష మంది దాకా పింఛన్‌‌దారులు మృతి చెందినట్లు లెక్కలు చెబుతున్నాయి. కనీసం వీరి ప్లేస్‌‌లో కూడా పెన్షన్లను సర్కారు రిప్లేస్‌‌ చేయలేదు.

దండిగా నిధులున్నా.. లోన్లు అందుతలేవు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌‌ సబ్సిడీ లోన్‌‌ అప్లికేషన్లు పత్తాలేవు. బీసీలకు నాలుగేండ్లుగా రుణాలు ఇస్తలేరు. 2018లో బీసీ లోన్లకు 5.7 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, యాబై వేల మందికి రుణాలిచ్చారు. 5.2 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలకు నిధులు దండిగా ఉన్నా పట్టించుకోవడంలేదు. ఎస్టీలకు సబ్సిడీ లోన్ల కోసం 2020లో గిరిజన సహకార ఆర్థిక సంస్థ లక్ష దరఖాస్తులు స్వీకరించింది. ఎస్సీ కార్పొరేషన్‌‌కు రెండు లక్షల అప్లికేషన్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు హడావుడి చేసిన సర్కారు తర్వాత వాటి ఊసే ఎత్తడంలేదు.

‘ధరణి’ కష్టాలు అన్నీఇన్నీ కాదు..
ధరణి పోర్టల్‌‌లో భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదు. ధరణి సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ వేసి.. కొద్ది రోజులు హడావుడి చేసిన సర్కారు పెద్దలు మళ్లీ ఆ సమస్యల జోలికెళ్లడం లేదు. దీంతో ధరణికి వచ్చిన ఐదు లక్షల దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉండిపోయాయి. ఫలితంగా వ్యవసాయ పనుల కోసం వెళ్లాల్సిన రైతులు కలెక్టర్, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. డ్యాష్ బోర్డుపై పెండింగ్ అప్లికేషన్లను తగ్గించుకునేందుకు కొందరు కలెక్టర్లు దరఖాస్తులను చూడకుండానే రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇండ్ల స్థలాలు రెగ్యులరైజ్ కాలే
సర్కార్ భూముల్లో ఉంటున్న వారి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజేషన్‌‌ చేస్తామని సర్కారు చెప్పింది. జీవో నంబర్ 58 కింద 125 గజాల్లోపు స్థలాన్ని ఫ్రీగా, జీవో నంబర్ 59 కింద 125 గజాలకు మించిన స్థలాన్ని రూ.వెయ్యి ఫీజుతో రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశమిచ్చింది. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా 1.68 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కానీ దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి గైడ్‌‌లైన్స్ కూడా విడుదల కాలేదు. దీంతో దరఖాస్తులు పెట్టుకున్న లక్షన్నర మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఇవే కాకుండా 2014లో ఇచ్చిన 58, 59 జీవోల కింద మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్‌‌లోనే ఉన్నాయి. మొత్తంగా 4.68 అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి.

పోడు పంచాయితీ తీరేదెన్నడు?
రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమ్రం భీం- ఆసిఫాబాద్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూల్ సహా పలు జిల్లాల్లోని సుమారు ఏడు లక్షల ఎకరాల్లో పోడు భూముల సమస్య ఉంది. గోండులు, కొలాంలు, బంజారాలు, కోయలు తదితర గిరిజన తెగలతోపాటు కొందరు గిరిజనేతరులు ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకొని జీవిస్తున్నారు. దీనిపై గతేడాది సర్కారు కేబినెట్‌‌ సబ్‌‌ కమిటీ వేసింది. గిరిజనులు, గిరిజనేతరుల నుంచి పట్టాల కోసం అప్లికేషన్లు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఇప్పటి దాకా కనీసం పరిశీలించలేదు.

గొర్రెల పంపిణీకి పైసా విదిలిస్తలే
రాష్ట్రంలో గొర్రెల పంపిణీ స్కీం మూడేళ్లుగా నిలిచిపోయింది. 7.29 లక్షల గొల్ల కురుమ కుటుంబాలకు గొర్రెల యూనిట్లు అందించాలని సర్కారు నిర్ణయించింది. గొర్రెల యూనిట్ల కోసం ఒక్కొక్కరు రూ.31,250 చొప్పున డీడీలు తీశారు. 3.65 లక్షల మందికి యూనిట్లు ఇచ్చారు. ఇంకా 3.63 లక్షల అప్లికేషన్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. మొదటి విడత గొర్రెల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. రెండో విడత అసలే ప్రారంభించలేదు. అనేక మంది బంగారం కుదువపెట్టి, ప్రైవేటులో వడ్డీలు తీసుకుని డీడీలు తీశారు. మరోవైపు గొర్రెల పంపిణీ కోసం గత బడ్జెట్‌‌లో రూ.వెయ్యి కోట్లు ప్రకటించగా.. నిధుల విడుదల ముచ్చటేలేదు. ఈ సారి బడ్జెట్‌‌లో కూడా వెయ్యి కోట్లు పెట్టినా ఇప్పటికీ పైసా రిలీజ్‌‌ చేయలేదు. 

పోడు పట్టాలియ్యాలె
పట్టాలిస్తమని సర్కారు చెబుతూనే.. ఫారెస్ట్ అధికారులు మాత్రం పంటలను ధ్వంసం చేస్తూ కందకాలు తీస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలి. ఓట్ల రాజకీయం చేయొద్దు. బతుకుదెరువు కోసం ఎన్నో ఏండ్ల నుంచి సాగుచేస్తున్న భూములకు అటవీ హక్కుల చట్టం కింద పట్టాలివ్వాలి.
- ఖమ్మం బద్రు నాయక్, అంబగిరి తండా, నాగర్ కర్నూల్

ఆరేండ్లుగా రేషన్ కార్డు లేదు
మాకు ఆరేండ్లుగా రేషన్ కార్డు లేదు. బియ్యం బయట కొనుక్కొచ్చుకుని తింటున్నాం. రెండేండ్ల కిందట అప్లై చేసుకున్నా కార్డు రాలేదు. ఏదైనా పథకానికి అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు అవసరం పడుతున్నది. ఆఫీసర్లను అడిగితే ‘మాకు తెల్వదు’ అంటున్నరు. రేషన్ కార్డు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి.
- షేక్ అహ్మద్, జహీరాబాద్