ఆగిన రేషన్‌ కార్డుల జారీ

ఆగిన రేషన్‌ కార్డుల జారీ
  • లక్షల్లో అప్లికేషన్లు
  • పరిశీలించనివే ఎక్కువ
  • జారీ ఆపాలని ఆదేశాలు
  • నిరీక్షిస్తున్న లబ్ధిదారులు

హైదరాబాద్, వెలుగు: ఆహార భద్రత కార్డుల జారీలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఇప్పటికే  లక్షకు పైగా దరఖాస్తులు రాగా పరిశీలన పెండింగ్‌‌లో పడింది. జూన్​ నుంచి జూలై నాటికే పరిశీలన పూర్తి చేసి కార్డులు జారీ చేయాలని అనుకున్నరు. అయితే పౌర సరఫరాల కమిషనరేట్​నుంచి ఇప్పుడే వద్దన్న ఆదేశాలు రావడంతో పరిశీలన, కార్డుల జారీ నిలిచిపోయినట్టు సమాచారం. ఈ విషయమై అధికారులను అడిగితే టెక్నికల్​ సమస్యలున్నట్టు చెబుతున్నరు. దీంతో ఈ నెలలోనైనా కార్డులు అందుతాయని అనుకున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురయింది.

మొత్తం దరఖాస్తులు 1,36,618

ఇప్పటి వరకు హైదరాబాద్​ జిల్లాలో కొత్తగా1,36,618 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎంత మందికి కార్డులు జారీ అయ్యాయి. ఎన్ని పెండింగ్‌‌లో ఉంచారో అనే  ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఇప్పటికే  గ్రేటర్‌‌లో 16,02,134 కుటుంబాలకు ఆహార భద్రత కార్డులు ఉన్నవి. జిల్లాలో 5,85,039 ఉన్నయి. ప్రస్తుతానికి జిల్లా రేషనింగ్​అధికారులకు అందిన దరఖాస్తుల ప్రకారం 1,36,618 కుటుంబాలు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నరు.

అక్కడ కొన్ని.. ఇక్కడ కొన్ని..

జిల్లాలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఆర్​ఐల వద్ద కొన్ని, తహసీల్దార్ల వద్ద మరికొన్ని దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నయి. దరఖాస్తులను వీరు పరిశీలించాక డిస్ట్రిక్​ సివిల్​ సప్లయ్​ ఆఫీసర్​వద్దకు చేరుతాయి. సదరు అధికారి కార్డులు మంజూరు చేస్తారు. రూల్స్‌‌ ప్రకారం లేకపోతే రిజెక్ట్​ అవుతాయి. ఇలా ఇప్పటి వరకు జిల్లా రేషనింగ్​ అధికారులకు అందిన దరఖాస్తులు ఆర్​ఐ వద్ద కొన్ని, తహసీల్దార్​వద్ద కొన్ని పెండింగ్​లో ఉన్నయి. మరికొన్నింటికి ఆమోదం లభించినప్పటికీ, పౌరసరఫరాల కమిషనరేట్​ఆదేశాలతో డీఎస్​వో వద్ద పెండింగ్​ ఉన్నయి. దీంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. కార్డుల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందో అధికారులు చెప్పలేమంటున్నరు.