
హనుమకొండ, వెలుగు : వరంగల్ ఎంజీఎం దవాఖానాలో ఎలుకల గోల తగ్గడం లేదు. ఈ ఏడాది మార్చి 27న హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే పేషెంట్ కాళ్లు, చేతివేళ్లను ఎలుకలు కొరికిన విషయం తెలిసిందే. అప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించడం, ఆ తరువాత ఎలుకలు కొరకడంతో రక్త స్రావమై పరిస్థితి విషమించి ఏప్రిల్ 2న చనిపోయాడు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అప్పటి సూపరింటెండెంట్ డా.బి.శ్రీనివాసరావును తప్పించింది. ఆ స్థానంలో ఛార్జ్ తీసుకున్న డా.వి.చంద్రశేఖర్ ఎలుకల బోన్లు ఏర్పాటు చేసి తాత్కాలిక చర్యలు చేపట్టారు. తరువాత లైట్తీసుకున్నారు. దీంతో మళ్లీ ఎంజీఎంలో ఎలుకల సంచారం మొదలైంది. వర్ధన్నపేటలోని హాస్టల్లో బల్లి పడిన ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఉంచిన ఆర్థో మెడికల్వార్డులోనే ఎలుకలు తిరుగుతూ కనిపించాయి.