గుండెపోటుతో మంత్రి రవి నాయక్ కన్నుమూత

గుండెపోటుతో మంత్రి రవి నాయక్ కన్నుమూత

పనాజీ: గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి రవి నాయక్ (79) గుండె పోటుతో కన్నుమూశారు. బుధవారం (అక్టోబర్ 15) తెల్లవారుజూమున ఇంట్లో గుండెపోటుకు గురి కాగా.. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను పోండాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‎లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 

అనంతరం రవి నాయక్ మృతదేహాన్ని పోండాలోని ఖడ్పబంద్‌లోని ఆయన నివాసానికి తరలించారు. బుధవారం (అక్టోబర్ 15) మధ్యా్హ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రవి నాయక్‎కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన గోవా వ్యవసాయ శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేశారు. 

రవి నాయక్ మరణం పట్ల ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రవి నాయక్ మరణం బాధాకరమని.. గోవా అభివృద్ధి పథాన్ని సుసంపన్నం చేసిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడిగా, అంకితభావంతో కూడిన ప్రజా సేవకుడిగా ఆయన చిరకాలం ప్రజలకు గుర్తుండిపోతారని అన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడం పట్ల ఆయన మక్కువ చూపారని గుర్తు చేశారు. 

►ALSO READ | కెన్యా దేశ మాజీ ప్రధాని ఒడింగా.. కేరళలో చనిపోయారు : ఆయన మన దేశం ఎందుకొచ్చారంటే..!

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా రవి నాయక్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకుడు రవి నాయక్ నాయకత్వం, నిరాడంబరత, ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. గోవా రాజకీయాల్లో ఆయనొక దిగ్గజమని.. ముఖ్యమంత్రిగా దశాబ్దాలుగా అంకితభావంతో చేసిన సేవ, కీలక శాఖల్లో మంత్రిగా ఆయన చేసిన కృషి రాష్ట్ర పాలన, ప్రజలపై చెరగని ముద్ర వేసిందని అన్నారు. ఆయన నాయకత్వం, వినయం, ప్రజా సంక్షేమానికి చేసిన కృషి ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.