
కెన్యా దేశం మాజీ ప్రధాని రైలా ఒడింగా.. భారతదేశంలోని కేరళలో రాష్ట్రంలో చనిపోయారు. ఈ ఘటన 2025, అక్టోబర్ 15వ తేదీ ఉదయం జరిగింది. కెన్యా దేశ మాజీ ప్రధాని కేరళకు ఎందుకు వచ్చారు.. అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం...
2008 నుంచి 2013 వరకు కెన్యా దేశానికి ప్రధానమంత్రి రైలా ఒడింగా. కెన్యా దేశంలో మోస్ట్ పాపులర్ లీడర్ కూడానూ.. 25 ఏళ్లు ప్రతిపక్ష నేతగా.. కెన్యాలోని లంగాటా నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు ఒడింగా. ఆయన వయస్సు 80 ఏళ్లు. కొంత కాలంగా ఆయన కంటి చూపు సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళంలోని ఆయుర్వేద కంటి ఆస్పత్రికి వచ్చారు. ఐదు రోజుల క్రితం కెన్యా నుంచి కేరళలోని ఆస్పత్రికి వచ్చారు మాజీ ప్రధాని ఒడింగా.
అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్టోబర్ 15వ తేదీ ఉదయం ఆయన ఆస్పత్రి ఆవరణలోనే మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. ఆస్పత్రి సిబ్బంది గమనించి వెంటనే ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది. ఉదయం 9 గంటల ప్రాంతంలో చనిపోయినట్లు ప్రకటించారు డాక్టర్లు.
►ALSO READ | మళ్లీ అదే మాట.. మునీర్ నా ఫేవరేట్.. మోదీ వెరీ గుడ్ ఫ్రెండ్: డొనాల్డ్ ట్రంప్
కెన్యా మాజీ ప్రధాని ఒడింగా వెంట.. ఆయన కుమార్తె రోజ్మేరీ, ఆయన వ్యక్తిగత డాక్టర్ ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీలోని కెన్యా రాయబారి కార్యాలయానికి సమాచారం ఇచ్చింది కేరళ ప్రభుత్వం.
కేరళతో ఉన్న అనుబంధం ఏంటీ..?
కెన్యా దేశానికి మాజీ ప్రధాని అయిన ఒడింగాకు కేరళలోని ఆయుర్వేద ఆస్పత్రికి ఉన్న అనుబంధం ఏంటీ అనే ప్రశ్న రావొచ్చు. ఈ అనుబంధం ఇప్పటి కాదు. ఒడింగా కుమార్తె రోజ్మేరీకి కూడా కంటి చూపు సమస్య వచ్చింది. చికిత్స కోసం ఆమె 2017లో కేరళలోని ఆయుర్వేద కంటి ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నారు. రెండేళ్లకు అంటే 2019 నాటికి ఆమె తన కంటి చూపును తిరిగి పొందారు. అప్పటి నుంచి ఈ కెన్యా దేశపు మాజీ ప్రధాని ఒడింగా ఫ్యామిలీలో ఎవరికి కంటి చూపు సమస్య వచ్చినా.. కేరళ రాష్ట్రం వస్తారు. ఈ విధంగా ఆయనకు ఈ ఆస్పత్రితో ప్రత్యేక అనుబంధం ఉంది.
ఇటీవల తన కంటి చూపు తగ్గిపోవటం.. చూపు మందగించటంతో.. కుమార్తె సాయంతో ఆయన ఐదు రోజుల క్రితం కేరళలోని ఈ ఆస్పత్రికి వచ్చారు. ఈ సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయారు.