
సిడ్నీ: టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. రాబోయే బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. దాంతో ఈ టోర్నీలో పాల్గొంటున్న హై ప్రొఫైల్ ఇండియన్ క్రికెటర్‌గా మారనున్నాడు. ఈ వారాంతంలో ఫ్రాంచైజీ అశ్విన్ చేరికపై అధికారిక ప్రకటన చేయనుంది. ఇప్పటికే ఐఎల్‌టీ20తో జత కట్టిన అశ్విన్.. జనవరి 4న ఆ టోర్నీ ముగిసిన తర్వాత సిడ్నీ థండర్స్‌తో చేరనున్నాడు.
అశ్విన్‌ను వ్యక్తిగతంగా సంప్రదించిన క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్‌బర్గ్.. బీబీఎల్‌లో ఆడే అవకాశాన్ని కల్పించారు. గత నెలలో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత అశ్విన్ విదేశీ లీగ్‌ల్లో ఆడాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే బీబీఎల్ విదేశీ డ్రాఫ్ట్‌లో అశ్విన్ పేరు నమోదు చేసుకోలేదు. దాంతో క్రికెట్ ఆస్ట్రేలియా ప్రత్యేకంగా అతనికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. 2022లో మార్టిన్ గప్టిల్ (మెల్‌బోర్న్ రెనెగెడ్స్)కు ఇలాగే పర్మిషన్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నప్పుడు అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇండియా తరఫున అత్యధి టెస్ట్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ (537) నిలిచాడు.