అభిమానిగా మారిన జడేజా.. ధోనీ ఇంటి ముందు ఫోటోలు దిగుతూ సందడి

అభిమానిగా మారిన జడేజా.. ధోనీ ఇంటి ముందు ఫోటోలు దిగుతూ సందడి

టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రాంచీలోని ఎంఎస్ ధోనీ ఫామ్‌హౌస్‌ను సందర్శించాడు. ధోనీది రాంచీ కావడంతో  నాలుగో టెస్ట్ ముగిసిన తర్వాత ఇక్కడకు చేరుకున్నాడు. జడేజా మంగళవారం (ఫిబ్రవరి 27) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ధోనీ ఇంటి ముందు తాను చేసిన పనులను అభిమానులతో పంచుకున్నాడు. కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. అందులో అతను రాంచీలోని MS ధోని ఫామ్‌హౌస్ ముందు పోజులివ్వడం హైలెట్ గా మారింది. 

దిగ్గజం ఇంటి ముందు ఫోటోలు దిగడం సరదాగా ఉందని తన ఇంస్టాగ్రామ్ లో తెలియజేశాడు. ధోనీ, జడేజా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ దశాబ్దకాలంగా టీమిండియాతో పాటు, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడారు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2023 సీజన్ లో వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని పుకార్లు వచ్చినా..అందులో వాస్తవం లేదని తేలింది. 2023 సీజన్ ఐపీఎల్ ఫైనల్లో చెన్నై చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. జడేజా వరుసగా సిక్సర్, ఫోర్ కొట్టి గెలిపించిన సంగతి తెలిసిందే. 

Also Read: లండన్‌కు వెళ్లిపోయిన రాహుల్.. ఐదో టెస్టుకు దూరం

ఈ ఫైనల్ అనంతరం ధోనీ ఎమోషనల్ అవుతూ జడేజాను ఎత్తుకున్న ఫోటో హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం జడేజా స్వదేశంలో  ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్నాడు. రాంచీలో జరిగిన 4వ టెస్టులో రవీంద్ర జడేజా బ్యాట్‌తో రాణించకపోయినా తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్ ల్లో జడేజా.. తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్ లో 43.40 సగటుతో 217 పరుగులు చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 17 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ల జాబితాలో  రెండవ స్థానంలో ఉన్నాడు.