
తన క్యారెక్టరైజేషన్సే కాదు.. సినిమాల టైటిల్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉండేలా చూసుకుంటున్నాడు రవితేజ. తాజాగా తన కొత్త చిత్రం టైటిల్‌ని రివీల్ చేశాడు. ఆయన హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న చిత్రానికి ‘రావణాసుర’ అనే పేరు ఫైనల్ చేశారు. పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వయొలెంట్‌గా కనిపిస్తోంది. రక్తంతో తడిసిన పుర్రెను పోలిన సింహాసనంపై సూట్ వేసుకుని కూర్చున్నాడు రవితేజ. వెనుక మరో తొమ్మిది తలలు ఉన్నాయి. సింహాసనం చుట్టూ తుపాకులు. జడ్జి చేతిలో ఉండే సుత్తి.. అతని చేతిలో ఉంది. అదీ రక్తంతో తడిసి. ఎదురుగా లా బుక్స్ ఉన్నాయి. మొత్తానికి పోస్టర్‌తోనే ఇదో హై యాక్షన్ థ్రిల్లర్ అనే ఫీల్‌ని క్రియేట్ చేశారు. మరోవైపు రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ టైటిల్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ‘హి ఈజ్ ఎ గ్రాండ్ మాస్టర్.. హి ఈజ్ ఎ క్రైమ్ పోస్టర్.. ఖిల్.. ఖిల్.. ఖిలాడి’ అంటూ సాగే ఈ పాటని శ్రీమణి రాశాడు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. ఫారిన్‌లో షూట్ చేశారు. మేకింగ్ షాట్స్‌ని సాంగ్ వీడియోలో చూపించారు. పెన్ స్టూడియోస్, ఎ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్.