ఎకరం టార్గెట్ రూ.200 కోట్లు!..రాయదుర్గంలో రికార్డు ధర దక్కించుకునే దిశగా టీజీఐఐసీ

ఎకరం టార్గెట్ రూ.200 కోట్లు!..రాయదుర్గంలో రికార్డు ధర దక్కించుకునే దిశగా టీజీఐఐసీ
  •     4,718.22 చదరపు గజాల స్థలానికి వచ్చే నెల 10న వేలం
  •     గజానికి కనీస అప్​సెట్​ ప్రైస్​గా రూ.3.10 లక్షలుగా నిర్ధారణ
  •     మొత్తం స్థలానికి రూ.146.26 కోట్లు ఫిక్స్​ చేసిన టీజీఐఐసీ
  •     గజం అప్​సెట్​ ప్రైస్​కు కనీసం 10‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేల కన్నా ఎక్కువ బిడ్​ వేసేలా నిబంధన

హైదరాబాద్, వెలుగు: రాయదుర్గం భూములు ప్రభుత్వానికి కాసుల పంట పండిస్తున్నాయి. ఎకరం రూ.వంద కోట్ల మార్క్​ దాటిందనుకునేలోపే.. అక్కడ రికార్డ్​ స్థాయిలో రూ.177 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు అదే జోష్​లో అక్కడ రూ.200 కోట్ల టార్గెట్​తో తెలంగాణ ఇండస్ట్రియల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ముందుకు వెళ్తున్నది. గత రికార్డులన్నీ చెరిపేసేలా అప్​సెట్​ ప్రైస్​ను సెట్​ చేస్తున్నది. తాజాగా రాయదుర్గంలోని ప్రైమ్​ ఏరియాలో ఉన్న 4,718.22 చదరపు గజాల (0.97 ఎకరాలు) స్థలాన్ని ఈ–వేలం వేయడానికి నిర్ణయించింది. శేరిలింగంపల్లి మండలంలోని పన్మక్తలో సర్వే నెంబర్​ 83/1లో ఉన్న 14ఏ/1, 14బీ/1 ప్లాట్లను ఒక లాట్  కింద వేలం వేయనుంది. 

దీనికి సంబంధించి రెండ్రోజుల కింద టీజీఐఐసీ నోటిఫికేషన్​ ఇచ్చింది. ఒక చదరపు గజానికి రూ.3.10 లక్షల అప్​సెట్​ ప్రైస్​ను నిర్ధారించింది. దానికి అదనంగా రూ.10 వేల చొప్పున అధికంగా బిడ్డర్లు ఎవరైనా బిడ్​ను దాఖలు చేయాలని నోటిఫికేషన్​లో పేర్కొంది. అంటే వేలం వేసే స్థలానికి కనీస ధర రూ.146.26 కోట్లుగా నిర్ధారించింది. ఆ స్థలం ఎకరంలోపే ఉండడంతో అప్​సెట్​ ధరే రికార్డు స్థాయిలో ఉంది. నవంబర్​ 10న ఆన్​లైన్​లో వేలం నిర్వహించి ఆ భూమిని అమ్మనున్నారు. అంతకుముందు ఈ నెల 22న టీహబ్​లో ప్రీబిడ్​ సమావేశాన్ని నిర్వహించనున్నారు. వేలానికి రిజిస్ట్రేషన్​, ప్రీ బిడ్​ ఈఎండీ (ఎర్నెస్ట్​ మనీ డిపాజిట్​) చెల్లింపులు, డాక్యుమెంట్​ ఫీజు చెల్లింపునకు నవంబర్​ 4ను చివరి తేదీగా వెల్లడించింది. ప్రీబిడ్​ ఈఎండీ చార్జ్​ను రూ.కోటిగా పేర్కొంది.  

మొన్ననే రూ.177 కోట్లు

రాయదుర్గంలో ఈ నెల 6న జరిగిన ఈ వేలంలో ఎకరం భూమి రూ.177 కోట్లకు అమ్ముడుపోయింది. ఎంఎస్​ఎన్​ రియల్టీ అనే సంస్థ వేలంలో ఆ భూములను దక్కించుకున్నది. మొత్తం రూ.1,357 కోట్లు వెచ్చించి 7.67 ఎకరాలను సొంతం చేసుకున్నది. అప్పుడు అక్కడ ఎకరం భూమికి టీజీఐఐసీ విధించిన అప్​సెట్​ ప్రైస్​ కేవలం రూ.104 కోట్లే. కానీ, ఇప్పుడు 0.97 ఎకరాల కే కనీస అప్​సెట్​ ప్రైస్​ను రూ.146 కోట్లుగా నిర్ధారించడం విశేషం. ఈ లెక్కన ఈసారి జరిగే వేలంలో అక్కడ ఎకరం భూమి రూ.200 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మునుపటి రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

మరో 10 ఎకరాలూ వేలం వేసే చాన్స్​

త్వరలోనే రాయదుర్గంలో మరో 10 ఎకరాల భూమిని టీజీఐఐసీ వేలం వేసేందుకు అవకాశాలున్నాయని తెలుస్తున్నది. ఈ వేలం ద్వారా రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్లను సమీకరించాలనే టార్గెట్​తో ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. రాయదుర్గంలో టీజీఐఐసీకి 470 ఎకరాల భూమి ఉండగా.. ఇప్పటికే గత పదేండ్ల కాలంలో 200 ఎకరాలు వేలంలో అమ్ముడుపోయింది. మిగిలిన 250 ఎకరాల్లో 50 ఎకరాలు న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మిగతా భూముల్లోని 10 ఎకరాలను వేలం వేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.