రెపో రేటు 6.5 శాతం దగ్గరనే

రెపో రేటు  6.5 శాతం దగ్గరనే
  • ఆరో ఎంపీసీ మీటింగ్‌‌లోనూ వడ్డీ రేట్లను మార్చని ఆర్‌‌‌‌బీఐ
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్‌‌ఫ్లేషన్ 5.4 శాతం..జీడీపీ గ్రోత్ రేట్‌ 7.3 శాతం

న్యూఢిల్లీ: 
వడ్డీ రేట్లను యాదాతథంగా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌‌‌‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. వరుసగా ఆరో మీటింగ్‌‌లోనూ కీలకమైన రెపో రేటును 6.5 శాతం దగ్గర కొనసాగించింది. గ్లోబల్‌‌గా అనిశ్చితి నెలకొందని, ఇన్‌‌ఫ్లేషన్‌‌ను 4 శాతం దిగువకు తీసుకొచ్చే అవసరం ఉందని ఆర్‌‌‌‌బీఐ పేర్కొంది.  వడ్డీ రేట్లు మారకపోవడంతో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ లోన్లపై వడ్డీని ప్రస్తుత లెవెల్స్ దగ్గరే కొనసాగించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను  దృష్టిలో పెట్టుకొని వడ్డీ రేట్లను మార్చకూడదని నిర్ణయించుకున్నామని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌ శక్తికాంత దాస్‌‌ పేర్కొన్నారు. గ్రోత్‌‌కు సపోర్ట్‌‌ చేస్తూనే ఇన్‌‌ఫ్లేషన్‌‌ను తగ్గించేందుకు వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించడాన్ని కొనసాగిస్తామన్నారు. 

ఇన్‌‌ఫ్లేషన్, గ్రోత్‌‌.. రెండింటిపై ఫోకస్‌‌

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్‌‌  4.5 శాతంగా , జీడీపీ గ్రోత్  రేట్ 7 శాతంగా నమోదవుతుందని ఆర్‌‌‌‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది.  2024–25 ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్‌‌‌‌ (క్యూ1) లో జీడీపీ 7.2 శాతం,  క్యూ2 లో 6.8 శాతం, క్యూ3 లో 7 శాతం, క్యూ4 లో 6.9 శాతం వృద్ధి చెందుతుందని లెక్కించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్ రేట్‌‌ 7.3 శాతంగా రికార్డవుతుందని నేషనల్ స్టాటిస్టికల్‌‌ ఆఫీస్‌‌ (ఎన్‌‌ఎస్‌‌ఓ)  అంచనా వేయగా, ఆర్‌‌‌‌బీఐ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.   గ్రాస్ వాల్యూ యాడెడ్‌‌ (జీవీఏ)  2023–24 లో 6.9 శాతం వృద్ధి చెందిందని, మాన్యుఫాక్చరింగ్‌‌, సర్వీసెస్ సెక్టార్లు పుంజుకున్నాయని దాస్‌ అన్నారు. జియో పొలిటికల్ టెన్షన్లు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్‌‌లో వోలటాలిటీ వంటివి గ్రోత్‌‌కి అడ్డంకిగా ఉన్నాయని పేర్కొన్నారు.

పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌‌మెంట్లు వస్తున్నాయని, దేశ ఎకానమీ స్ట్రాంగ్‌‌గా ఉందని  వెల్లడించారు.  రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా,   2024–25 ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతంగా రికార్డవుతుందని ఆర్‌‌‌‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోని  క్యూ1 లో 5 శాతంగా, క్యూ2 లో 4 శాతంగా, క్యూ3 లో 4.6 శాతంగా, క్యూ4 లో 4.7 శాతంగా రికార్డవుతుందని లెక్కించింది.  తరచూ ఆహార పదార్ధాల ధరలు పెరుగుతుండడంతో ఇన్‌‌ఫ్లేషన్ దిగిరావడంలో అంతరాయం ఏర్పడుతోందని ఆర్‌‌‌‌బీఐ  ఎంపీసీ తెలిపింది.   

రూల్స్ ఫాలో కాకపోవడంతోనే..

రూల్స్ ఫాలో కాకపోవడంతోనే పేటీఎంపై చర్యలు తీసుకున్నామని, వ్యవస్థలో ఎటువంటి రిస్క్‌‌లు లేవని శక్తికాంత దాస్ అన్నారు. పరిస్థితులకు తగ్గట్టే తీసుకునే చర్యల తీవ్రత ఉంటుందని చెప్పారు. అప్పటికి కూడా సంస్థలు రెగ్యులేషన్స్ ఫాలో కాకపోతేనే  సూపర్‌‌‌‌వైజరీ చర్యలు, రిస్ట్రిక్షన్లు పెట్టడం వంటివి జరుగుతాయని చెప్పారు.   పేటీఎం ఇష్యూకి సంబంధించి   యూజర్ల ఆందోళనలను తొలగించేందుకు త్వరలో  ఫాక్‌‌ (ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్‌‌ క్వశ్చన్స్‌‌) విడుదల చేస్తామని దాస్ అన్నారు. పేటీఎం షేర్లు గురువారం 10 శాతం పతనమై రూ. 447 దగ్గర క్లోజయ్యాయి. 

మరిన్ని అంశాలు..

1)రిటైల్‌‌, ఎంఎస్‌‌ఎంఈ  లోన్లు ఇచ్చేటప్పుడు అప్పుకి సంబంధించి కీ ఫాక్ట్ స్టేట్‌‌మెంట్‌‌ను(కేఎఫ్‌‌ఎస్‌‌) ను  కమర్షియల్ బ్యాంకులు, డిజిటల్ లెండింగ్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్‌‌ కంపెనీలు  తమ బారోవర్లకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టేట్‌‌మెంట్‌‌లో వడ్డీతో సహా అన్ని రకాల ఫీజులు, ఇతరత్రా వివరాలు ఉంటాయి.
2) డిజిటల్ రూపాయిని  ఆఫ్‌‌లైన్ మోడ్‌‌లో ట్రాన్స్‌‌ఫర్ చేసుకోవడానికి ఆర్‌‌‌‌బీఐ ఓ పైలెట్ ప్రాజెక్ట్‌‌ను లాంచ్ చేయనుంది.