
దేశంలోని తన బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31వరకు అన్ని బ్యాంకులు తెరిచి ఉంచాలని ఆదేశించింది. మార్చి 31 2023న సాధారణ పని వేళలు ముగిసే వరకు ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించిన ఓవర్-ది -కౌంటర్ లావాదేవీల కోసం సంబంధిత శాఖలను తెరిచి ఉంచాలని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలోపు లెక్కించాలని తన ఏజెన్సీ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్ (RTGS) ద్వారా లావాదేవీలు మార్చి 31 అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2022- 23 ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా యానువల్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ ఆ రోజునే ఉంటుంది.
మరోవైపు ప్రభుత్వ చెక్కులకు సంబంధించి మార్చి 31న ప్రత్యేక క్లియరింగ్ కూడా నిర్వహించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దీనికి సంబంధించి RBIకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ అవసరమైన కీలక సూచనలు జారీ చేయనుందని వెల్లడించింది. GST/TIN2.0/ఈ రసీదుల లగేజ్ ఫైల్స్ అప్‌లోడింగ్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీల రిపోర్టింగ్‌కు సంబంధించి మార్చి 31 రిపోర్టింగ్ విండో ఏప్రిల్ 1 మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది.