
- ఇతర దేశాలతోనూ ఇలాంటి ఒప్పందాలు అవసరం
- ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
ముంబై: యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని, భవిష్యత్తులో ఇతర దేశాలతో కూడా ఇలాంటి మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. మల్హోత్రా శుక్రవారం ముంబైలో జరిగిన ఎఫ్‌ఈ మోడర్న్ బీఎఫ్‌ఎస్ఐ సమ్మిట్‌లో మాట్లాడుతూ, అమెరికాతో వాణిజ్య చర్చలు కూడా కీలక దశలో ఉన్నాయని తెలిపారు. యూకేతో ఒప్పందం తయారీ, సేవల రంగాలకు సహాయపడుతుందని మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఫెడరల్ రిజర్వ్ స్వయం ప్రతిపత్తిని నిలబెట్టడానికి యూఎస్ ఫెడ్ చీఫ్జెరోమ్ పావెల్ చేసిన కృషిని మల్హోత్రా అభినందించారు.
క్రిప్టో కరెన్సీ నిబంధనలపై ఆర్‌బీఐ ఆందోళనలను, ఈ అంశంపై నియమించిన ప్రభుత్వ ప్యానెల్ పరిగణనలోకి తీసుకుంటుందని మల్హోత్రా చెప్పారు. బ్రిక్స్ కూటమి ప్రత్యేక కరెన్సీపై పని చేయడం లేదని, అన్ని దేశాల్లాగే భారతదేశం కూడా తన సొంత కరెన్సీ పటిష్టమయ్యేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ చమురు కొనుగోళ్లను నిర్వహించడంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ చేసిన కృషిని కూడా మల్హోత్రా ప్రశంసించారు.