లక్ష్మీ విలాస్ బ్యాంక్ పై ఆర్‌‌‌‌బీఐ కొరడా

లక్ష్మీ విలాస్ బ్యాంక్ పై ఆర్‌‌‌‌బీఐ కొరడా

ముంబై : లక్ష్మీ విలాస్ బ్యాంక్‌‌ను దారిలో పెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌‌ ఇండియా(ఆర్‌‌‌‌బీఐ) సిద్ధమైంది. తీవ్ర మొండి బకాయిలతో సతమతమవుతున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్‌‌ను ఆర్‌‌‌‌బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్(సత్వర దిద్దుబాటు చర్యలు)లోకి తీసుకొచ్చింది. దీనివల్ల బ్యాంకు అడ్డుగోలుగా రుణాలివ్వడానికి కుదరదు. ఎప్పటికప్పుడు రుణాలను వసూలు చేసుకుంటూ ఉండాలి. అంటే బ్యాంక్‌‌లో జరిగే ప్రతిదీ ఆర్‌‌‌‌బీఐకి తెలుపాల్సి ఉంటుంది. మరిన్ని రిస్క్‌‌లను ఎదుర్కొనేందుకు సరియైన మూలధనం లేకపోవడంతో పాటు, మొండి బకాయిలు ఎక్కువ అవ్వడం, గత రెండేళ్ల నుంచి నష్టాలే వస్తుండటంతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ తీవ్ర సతమతమవుతోంది. తమను ఆర్‌‌‌‌బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్(పీసీఏ) కిందకు తీసుకొచ్చిన విషయాన్ని బ్యాంక్‌‌కు చెందిన వర్గాలు కూడా ధృవీకరించాయి.  దీంతో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌‌, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ విలీన ప్రతిపాదనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండింటి విలీనం అవుతుందో, లేదోనని బ్యాంకింగ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు ఇండియాబుల్స్‌‌లో కూడా కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగమైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. చీటింగ్‌‌కు పాల్పడి నిధులను దుర్వినియోగపరిచారనే కేసులో ఈ బ్యాంక్ డైరెక్టర్లపై ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల వింగ్ ఫిర్యాదు రిజిస్టర్ చేసి, విచారణ ప్రారంభించింది. కొంతమంది డైరెక్టర్లు తమ ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ నిధులను దుర్వినియోగం చేశారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని రెలిగేర్‌‌ కంపెనీ ఫిర్యాదులో పేర్కొంది. అయితే కుట్రకు పాల్పడ్డ డైరెక్టర్ల పేర్లు మాత్రం బయటకు రాలేదు. వీరిపై న్యాయపరమైన చర్యలు ఉంటాయని బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది.

రుణాల జారీపై ఆంక్షలు…

ప్రాంప్ట్ కరెక్టివ్ చర్యలతో(పీసీఏ) బ్యాంక్‌‌ పనితీరును మెరుగుపరచాలని ఆర్‌‌‌‌బీఐ లక్ష్యంగా పెట్టుకున్నట్టు లక్ష్మీ విలాస్ బ్యాంక్ చెప్పింది. బ్యాంక్ రోజూవారీ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది. డిపాజిట్ల స్వీకరణ, రీపేమెంట్ వంటివి సాధారణంగానే జరుగుతాయని తెలిపింది. పీసీఏ కింద, బ్యాంక్‌‌లు కార్పొరేట్లకు ఇచ్చే రుణాలను తప్పనిసరిగా తగ్గించాలి. పలు రంగాలకు ఇచ్చే రుణాలపై దృష్టిసారించాలి. కొత్త బ్రాంచ్‌‌ల ఏర్పాటు, డివిడెండ్లు చెల్లింపులపై కూడా ఆంక్షలుంటాయి. ప్రస్తుతం ఆర్‌‌‌‌బీఐ పీసీఏ కింద యూనిటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్‌‌‌‌సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, యూకో బ్యాంక్‌‌లు ఉన్నాయి. వ్యక్తిగత కారణాలతో లక్ష్మీ విలాస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పార్థసారథి ముఖర్జీ ఈ ఏడాది ఆగస్ట్‌‌లోనే తప్పుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు, రెగ్యులేటరీ అథారిటీలకు తాము సహకరిస్తామని లక్ష్మీ విలాస్ బ్యాంక్ చెప్పింది.

హైకోర్టులోనూ విచారణ

ఇండియాబుల్స్‌‌  కోట్ల రూపాయల రుణాలను షెల్ కంపెనీలకు ఇచ్చిందనే పిటిషన్‌‌ను కూడా విచారించడానికి ఢిల్లీ హైకోర్టు ఒప్పుకుంది. విపరీతంగా పెరిగిన మొండిబాకీలు, రిస్క్ అసెట్స్ రేషియోలో తగిన మూలధనం లేకపోవడం, వరుసగా రెండేళ్ల నుంచి నష్టాలే వస్తుండటంతో ఆర్‌‌‌‌బీఐ తమపై యాక్షన్ తీసుకున్నట్టు లక్ష్మీ విలాస్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో తెలిపింది. బ్యాంక్‌‌పై ఆంక్షలు విధించడం ప్రారంభమైనట్టు ఆర్‌‌‌‌బీఐ చెప్పినట్టు పేర్కొంది. తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ.. ప్రతి నెలా ఆర్‌‌‌‌బీఐకి బ్యాంక్ ప్రొగ్రెస్‌‌ను తెలియజేయాలని పేర్కొనట్టు తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో, బ్యాంక్‌‌ నికర ఎన్‌‌పీఏలు 8.30 శాతం పెరిగాయి. క్యాపిటల్ అడిక్వసీ రేషియో 7.72 శాతం ఉంది. ఆస్తులపై రిటర్నులు –2.32 శాతం నమోదయ్యాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నికర నష్టాలు రూ.894.10 కోట్లుగా పోస్ట్ చేసింది.