
- ఇన్‌ఫ్లేషన్ తగ్గించడంపైనే దృష్టంతా
బిజినెస్ డెస్క్, వెలుగు: కీలకమైన రెపో రేటును (ఆర్‌బీఐ బ్యాంకులకు ఇచ్చే ఫండ్స్‌పై వేసే వడ్డీ) రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.40 శాతానికి చేరుకుంది. ఇది కరోనా ముందు స్థాయి 5.15 శాతం కంటే ఎక్కువ కావడం గమనించాలి. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచడంపై ఎంపీసీ సభ్యులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం వరసగా ఇది మూడో సారి.
ఈ ఏడాది మే నెలలో 40 బేసిస్ పాయింట్లు, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు పెంచారు. ఈసారి రివర్స్ రెపో రేటు (ఆర్‌బీఐ దగ్గర బ్యాంకులు డిపాజిట్ చేసే ఫండ్స్ వచ్చే వడ్డీ) ను కూడా 3.85 శాతానికి పెంచారు.
ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన విషయాలు..
- స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటును ఆర్‌బీఐ ఎంపీసీ 5.15 శాతానికి పెంచింది. ఎస్‌డీఎఫ్ కూడా రివర్స్ రెపో రేటు మాదిరే పనిచేస్తుంది. కానీ, రివర్స్ రెపో రేటులో డిపాజిట్లపై బ్యాంకులకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ దక్కుతాయి. ఎస్‌డీఎఫ్ ఎంచుకుంటే బ్యాంకులు ఎటువంటి కొలేటరల్ లభించదు.
- మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును కూడా రెపో రేటు పెంపునకు తగ్గట్టు ఆర్‌బీఐ సవరించింది. ఈ రేటును 5.65 శాతానికి పెంచింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఆర్‌బీఐ నుంచి ఎమెర్జెన్సీగా ఫండ్స్ తీసుకోవాలనుకునే బ్యాంకులు రెపో రేటుకి బదులు మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును చెల్లించాల్సి ఉంటుంది.
- రేట్ల పెంపు ఇంకా కొనసాగుతుందనే సంకేతాలను ఆర్‌బీఐ ఇచ్చింది. దీనిని బట్టి రానున్న ఎంపీసీ మీటింగ్‌లలో కూడా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని అంచనావేయొచ్చు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ (క్యూ2) లో దేశంలో ఇన్‌ఫ్లేషన్ 7.1 శాతంగా, మూడో క్వార్టర్‌లో 6.4 శాతంగా, నాలుగో క్వార్టర్‌లో 5.8 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. ఈ ఏడాది జూన్ పాలసీలో వేసిన అంచనాల కంటే ఈసారి ఇన్‌ఫ్లేషన్ అంచనాలను కొద్దిగా తగ్గించారు.
- జీడీపీ గ్రోత్ అంచనాలను ఆర్‌బీఐ సవరించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో జీడీపీ గ్రోత్ రేటు (ఏడాది ప్రాతిపదికన) 16.2 శాతంగా, క్యూ2 లో 6.2 శాతంగా, క్యూ3 లో 4.1 శాతంగా, క్యూ4 లో 4 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనావేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో జీడీపీ గ్రోత్ 6.7 శాతంగా ఉంటుందని లెక్కించింది.
- ఇంకా వ్యవస్థలో సరిపడినంత లిక్విడిటీ ఉందని ఎంపీసీ పేర్కొంది. ఈ ఏడాది జూన్–జులై మధ్య ఎల్‌ఏఎఫ్ (రెపో రేటు, రివర్స్ రెపోరేటు మధ్య తేడా) ద్వారా రోజుకి సగటున రూ. 3.8 లక్షల కోట్ల లిక్విడిటీని వ్యవస్థలో నుంచి తగ్గించామని వివరించింది. ఈ ఏడాది ప్రారంభంలో వ్యవస్థలో అదనంగా ఉన్న లిక్విడిటీ రూ. 7 లక్షలు కాగా, ప్రస్తుతం ఇది రూ. 2 లక్షల కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ తెలిపింది. వ్యవస్థలో మనీ సప్లయ్ ఏడాది ప్రాతిపదికన 7.9 శాతం పెరిగిందని, కమర్షియల్ బ్యాంకులు ఇచ్చే అప్పులు 14 శాతం పెరిగాయని పేర్కొంది.
- దేశ ఫారెక్స్ నిల్వలు ఈ ఏడాది జులై 29 నాటికి 573.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
- ఎన్‌ఆర్‌ఐలు దేశంలోని తమ ఫ్యామిలీ మెంబర్లు, ఇతరుల కోసం వివిధ రకాల బిల్లు పేమెంట్లను (కరెంట్ బిల్లులు, ఎడ్యుకేషన్ బిల్లులు వంటివి) భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా చేసుకోవడానికి ఆర్‌బీఐ అనుమతిచ్చింది.
- రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ స్కీమ్ కిందకు సిబిల్ వంటి క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ కంపెనీ(సీఐసీ) లను ఆర్‌బీఐ తీసుకొచ్చింది. అంతేకాకుండా సీఐసీలు ఇంటర్నల్‌గా అంబుడ్స్‌మన్ ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడం తప్పనిసరి అని తెలిపింది.
- మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ రేట్ల పెంపు ఉంది. రేట్ల పెంపు కొనసాగుతుందనే సంకేతాలను ఇచ్చింది. దీనిని బట్టి ఆర్‌బీఐ ఇంకా న్యూట్రల్ జోన్‌కి వచ్చినట్టు లేదు. పెరిగిన ఇన్‌ఫ్లేషన్‌ను తగ్గించేందుకు అన్ని స్ట్రాటజీలు ఫాలో అవుతామనే సంకే తాలను ఆర్‌బీఐ ఇస్తోంది...
‑ అరొదీప్ నంది,
ఇండియా ఎకనామిస్ట్, నోమురా
మరింత భారంగా లోన్ ఈఎంఐలు..
రెపో రేటు పెరగడంతో ఈ రేటుతో లింక్ అయి ఉన్న లోన్లను బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు పెంచడం స్టార్ట్ చేశాయి. హోమ్ లోన్లను కొత్తగా తీసుకున్న వారిపైన, ఇప్పటికే తీసుకున్నవారిపైన ఈఎంఐల భారం మరింత పడనుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఇస్తున్న లాంగ్ టెర్మ్ లోన్లలో మెజార్టీ లోన్లను రెపో రేటుకు లింక్ అయి ఉన్నాయి. రెపో రేటు పెరగడంతో ఎంసీఎల్‌ఆర్ (కనీస వడ్డీ రేటు) ను కూడా బ్యాంకులు పెంచుతున్నాయి. దీంతో అన్నిరకాల లోన్ల వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు తమ హోమ్ లోన్లపై వడ్డీని పెంచడం మొదలు పెట్టాయని, సమీప భవిష్యత్‌లో కూడా ఇది కొనసాగుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు రూ. 30 లక్షల హోమ్ లోన్‌ను 20 ఏళ్ల కాలపరిమితికి గాను ఏడాదికి 8 శాతం వడ్డీ రేటుకు తీసుకుంటే, తాజాగా రెపో రేటు పెరగడం వలన ఈ లోన్ ఈఎంఐ రూ. 941 ఎక్కువవుతుంది. అంటే హోమ్ లోన్ ఈఎంఐ రూ.25,093 నుంచి రూ. 26,034 కు పెరుగుతుంది. ప్రతి రూ. లక్ష లోన్‌పై ఈఎంఐ రూ. 31.37 పెరుగుతుంది. అదే 7 ఏళ్ల కాలపరిమితికి గాను రూ. 8 లక్షల ఆటో లోన్ వడ్డీ రేటు 10.50 శాతం దగ్గర తీసుకుంటే, ఈ లోన్ ఈఎంఐ రూ.209 పెరిగి రూ. 13,489 నుంచి రూ. 13,698 కి చేరుకుంటుంది. ఐదేళ్ళ టైమ్ పీరియడ్ ఉన్న రూ. 5 లక్షల పర్సనల్ లోన్‌పై వడ్డీ 14.5 శాతం ఉంటే తాజాగా 15 శాతానికి పెరుగుతుంది. దీంతో ఈఎంఐ రూ. 131 పెరిగి రూ. 11,764 నుంచి రూ. 11,895 కి చేరుకుంటుంది.