తెలంగాణకు అప్పుల్లో భారీ కోత

తెలంగాణకు అప్పుల్లో భారీ కోత

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరం అప్పుల్లో భారీ కోత పడింది. ఇష్టారీతిన గ్యారంటీ అప్పులు చేయడంతో, బాండ్ల వేలంతో  తీసుకునే రుణానికి ఈసారి ఆర్​బీఐ నుంచి బ్రేక్​లు పడ్డాయి. కేంద్ర ఆర్థిక శాఖ చేసిన సూచనలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకుంది. రూ.19వేల కోట్ల అప్పును ఆర్​బీఐ తగ్గించింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​లో సర్కార్​ తీసుకునే అప్పు.. ఎంత వరకు సీలింగ్​ ఉందనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. మొన్నటిదాకా అడ్​హక్​(తాత్కాలిక) పద్ధతిలో రుణం తీసుకున్న రాష్ట్రం.. ఇక మీద సాధారణంగానే తీసుకోనుంది. దాదాపు రూ.54వేల కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్​లో ప్రభుత్వం భావించినప్పటికీ.. ఇప్పుడు విధించిన కోతతో రూ.35వేల కోట్లు మాత్రమే రానున్నాయి. ఇవిగాకుండా గ్యారంటీల పేరుతో తీసుకునే అప్పులు కూడా పరిమితుల మేరకే లభించనున్నాయి. ఎట్లపడితే అట్ల కార్పొరేషన్లు​ ఏర్పాటు చేసి అప్పులు తీసుకోకుండా కేంద్ర ఆర్థిక శాఖ చెక్​ పెట్టింది. తీసుకున్న అప్పు ఎలా తిరిగి చెల్లిస్తారో స్పష్టమైన రిపోర్ట్​ ఇచ్చాకే.. గ్యారంటీ లోన్లు మంజూరు చేయనున్నారు. బడ్జెట్​ నుంచి చెల్లింపులు చేసేట్టు ఉంటే.. అప్పు రాదని స్పష్టం చేసినట్లు తెలిసింది.

రానున్న 8 నెలల్లో రూ.25వేల కోట్లే..

రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మార్చి నాటికి రూ.35వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకునేందుకు చాన్స్​ ఉంది. దీంట్లో ఇప్పటికే రూ.10వేల కోట్లు తీసుకున్నది. జూన్​లో రూ.7వేల కోట్లు తీసుకోగా, మంగళవారం ఆర్​బీఐ నుంచి మరో రూ.3వేల కోట్ల అప్పు తీసుకుంది. దీంతో మరో 8నెలల్లో ఇంకో 25వేల కోట్లు మాత్రమే తీసుకునేందుకు చాన్స్​ ఉంది. ఈ లెక్క ప్రతినెలా రూ.3 వేల కోట్ల చొప్పున ప్రభుత్వం అప్పు చేయాల్సి ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.47,500 కోట్ల అప్పు తీసుకుంది. బాకీ విషయంలోరాజకీయం​ ఏమీ లేదని ఆర్థిక శాఖ ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకారమే ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. విద్యుత్​ సంస్కరణలు అమలు చేయడంతో ఏపీకి అదనంగా రూ.7వేల కోట్ల అప్పు వస్తోందని తెలిపారు. అప్పులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని రాష్ట్ర సర్కార్​ భావించినప్పటికీ దీనిపై పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది.

కార్పొరేషన్ల అప్పులపై ఆశలు వదులుకోవాల్సిందే..

గ్యారంటీ అప్పులను ఇష్టమొచ్చినట్లు తెచ్చుకునే వీల్లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అందులో భాగంగానే  గ్యారంటీ అప్పులపై అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ ఇటీవల లెటర్​ కూడా రాసింది. దీంతో రాష్ట్ర సర్కార్​ గ్యారంటీ అప్పులపై కూడా ఆశలు వదులుకుంది. పోయిన ఆర్థిక సంవత్సరం వరకు రాష్ట్ర సర్కార్ గ్యారంటీల పేరుతో తెచ్చే అప్పులను లెక్కలో చూపట్లేదు. ఇదంతా ఎఫ్​ఆర్​బీఎం పరిధిలోకి రాకుండా జాగ్రత్త పడుతోంది. ఆ అప్పుల కిస్తీలు మాత్రం బడ్జెట్​లో నుంచి కడుతూ వస్తోంది. ఇప్పుడు ఇలా కట్టినవన్నీ ఎఫ్​ఆర్​బీఎం (ఆర్​బీఐ) అప్పుల కింద లెక్కిస్తామని చెప్పింది. ఇదిలా ఉంటే 2023 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు మొత్తం రూ.3.44 లక్షల కోట్లకు చేరుతుందని మార్చిలో పెట్టిన బడ్జెట్​లోనే ప్రభుత్వం వెల్లడించింది. కానీ బడ్జెట్​తో సంబంధం లేకుండా ఇరిగేషన్​ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే తెచ్చిన రుణాలు రూ.1,35,282 కోట్లు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ష్యూరిటీపై తెచ్చింది. మొత్తంగా ప్రభుత్వం తెచ్చిన అప్పుల మొత్తం రూ.4.50 లక్షల కోట్లు దాటుతోంది.