
Repo Rate: దేశంలో గడచిన కొన్ని వారాలుగా అనేక ఆర్థిక సంస్థలు ఈసారి కూడా మానిటరీ పాలసీలో రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనాలను పంచుకున్నాయి. అయితే ప్రస్తుతం అమెరికా నుంచి వాణిజ్య సుంకాలు భారత్ పై ట్రంప్ పెంచటం.. ఇండియాను టార్గెట్ చేయటంతో ఈసారి ఎంపీసీలో ఆర్బీఐ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.
దీంతో కీలక రెపో రేటును 5.5 శాతం వద్ద కొనసాగించనున్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ చెప్పారు. దీనికి ముందు జూన్ సమావేశంలో ఎంపీసీ అత్యధికంగా 50 బేసిస్ పాయింట్లు రెపో రేటును తగ్గించి పెద్ద రిలీఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా వడ్డీ రేట్లు తగ్గుతాయని దీంతో తమ ఈఎంఐల భారం తగ్గించుకోవచ్చని ఎంతగానో ఎదురుచూసిన మధ్యతరగతి ప్రజలకు షాక్ ఇచ్చింది ఆర్బీఐ. దీంతో హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ వంటి రుణాల చెల్లింపుల్లో ఎలాంటి తగ్గింపులు ప్రజలకు లభించలేదు.
ALSO READ : 11 నెలల గరిష్ట స్థాయికి..సేవల రంగం వృద్ధి
ఇదే క్రమంలో రిజర్వు బ్యాంక్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మార్చకుండా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో ద్రవ్యల్బణం మరింతగా తగ్గనున్నట్లు అంచనాలను పంచుకుంది. సీపీఐ ద్రవ్యోల్బణం 2025-26 ఆర్థిక సంవత్సరంలో సగటున 3.1 శాతం వద్ద ఉండవచ్చని పేర్కొంది. ఇది జూన్ సమావేశంలో పేర్కొన్న 3.7 శాతం నుంచి తగ్గించబడింది. ఒకపక్క అగ్రరాజ్యం అమెరికా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ టారిఫ్స్ పెంచుతున్న క్రమంలో రిజర్వు బ్యాంక్ ద్రవ్యోల్బణం అంచనాలను తగ్గించటం సాహసోపేతమైన నిర్ణయంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.