
- జీడీపీ గ్రోత్ రేట్ అంచనాలను 7 శాతానికి పెంచిన ఆర్‌బీఐ ఎంపీసీ
- యదాతథంగానే ఇన్‌ఫ్లేషన్ అంచనాలు, రెపో రేటు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7 శాతం వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అంచనా వేస్తోంది. గతంలో వేసిన అంచనా 6.5 శాతం నుంచి పెంచింది. కన్జూమర్ డిమాండ్ బాగుందని, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో ప్రొడక్షన్ పెరిగిందని వెల్లడించింది. రెండు నెలలకొకసారి జరిగే మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మీటింగ్ వివరాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. గ్లోబల్ పొలిటికల్ టెన్షన్లు ఎకానమీ గ్రోత్‌కు పెద్ద ముప్పు అని పేర్కొన్నారు. డిసెంబర్ క్వార్టర్(క్యూ3) లో జీడీపీ గ్రోత్ రేట్ 6.5 శాతంగా, మార్చి క్వార్టర్ (క్యూ4) లో 6 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేస్తోంది. దేశ ఎకానమీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి చెందింది.
కాగా, ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో జీడీపీ గ్రోత్ రేటు 7.8 శాతంగా, సెప్టెంబర్ క్వార్టర్‌లో 7.6 శాతంగా నమోదయ్యింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ అంచనా వేశాయి. 6.4 శాతం వృద్ధి చెందుతుందని ఎస్ అండ్ పీ లెక్కించింది.
వడ్డీ రేట్లు మార్చలే..
వరుసగా ఐదో పాలసీ మీటింగ్‌లో కూడా కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎంపీసీ మార్చలేదు. దీంతో రెపో రేటు 6.5 శాతం దగ్గరే కొనసాగుతోంది. ఇన్‌ఫ్లేషన్‌ను కంట్రోల్ చేయడమే తమ టాప్ ప్రయారిటీ అని శక్తి కాంత దాస్ వెల్లడించారు. వ్యవస్థలోని లిక్విడిటీ తగ్గించడానికి మొగ్గు చూపారు. మానిటరీ పాలసీని సులభతరం చేసే ఆలోచన లేదని దాస్ పేర్కొన్నారు. మానిటరీ పాలసీ మెయిన్ గోల్ ఇన్‌ఫ్లేషన్‌ను కంట్రోల్ చేయడమని, 4 శాతంలోపు తీసుకురావడమే టార్గెట్‌గా పెట్టుకున్నామని అన్నారు.
ఇన్‌ఫ్లేషన్ 5.4 శాతం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ 5.4 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ ఎంపీసీ అంచనా వేసింది. గతంలో వేసిన అంచనాలను మార్చలేదు. డిసెంబర్ క్వార్టర్‌గాను ఇన్‌ఫ్లేషన్ అంచనా 5.6 శాతం నుంచి 5.4 శాతానికి సవరించింది. మార్చి క్వార్టర్‌కు 5.2 శాతమే కొనసాగించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో 5.2 శాతంగా, సెప్టెంబర్ క్వార్టర్‌లో 4 శాతంగా ఉంటుందని తెలిపింది. డిసెంబర్ క్వార్టర్ అంచనాలను 4.7 శాతంగా వేసింది. ఇన్‌ఫ్లేషన్, గ్రోత్..ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఇన్‌ఫ్లేషన్ 4 శాతం దిగువకు ఇప్పట్లో వచ్చేటట్టు లేదని వివరించారు. కొన్ని నెలలు మంచి డేటా వచ్చినంత మాత్రాన పాలసీని సులభం చేయలేమని దాస్ చెప్పారు.
హాస్పిటల్స్‌లో పెద్ద యూపీఐ ట్రాన్సాక్షన్లు..
కొన్ని సెగ్మెంట్‌లలో యూపీఐ పేమెంట్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ఆర్‌బీఐ ఎంపీసీ పెంచింది. హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్లలో చేసే యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ. లక్ష నుంచి రూ.ఐదు లక్షలకు పెంచింది. పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ చేయడానికి యూజర్లకు వీలుంటుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కొన్ని రికరింగ్ పేమెంట్స్‌పై కూడా లిమిట్స్‌ను ఆర్‌బీఐ పొడిగించింది. మ్యూచువల్ ఫండ్స్ సబ్‌స్క్రిప్షన్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం, క్రెడిట్ కార్డ్ రీపేమెంట్స్ కోసం చేసే రికరింగ్ పేమెంట్స్ సింగిల్ ట్రాన్సాక్షన్‌లో రూ.15 వేలు దాటితే అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథంటికేషన్ (ఏఎఫ్‌ఏ) అవసరం. తాజాగా ఈ లిమిట్‌ను రూ. లక్షకు పెంచారు. దీంతో రూ. లక్ష వరకు చేసే ఈ రికరింగ్ పేమెంట్లకు అదనపు చెకింగ్ అవసరం లేదు. ఫిన్‌టెక్ సెక్టార్‌లోని డెవలప్‌మెంట్‌ను అర్థం చేసుకోవడానికి, సపోర్ట్ చేయడానికి ‘ఫిన్‌టెక్ రిపాజిటరీ’ ఏర్పాటు చేస్తామని శక్తికాంత దాస్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా అంతకంటే ముందే ఇది అందుబాటులోకి వస్తుందని, ఫిన్ టెక్ కంపెనీలు వాలంటరీగా ఇన్‌ఫర్మేషన్ పంచుకోవాలని చెప్పారు. అంతేకాకుండా ఫైనాన్షియల్ సెక్టార్ కోసం క్లౌడ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్ 1 తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 604 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ ప్రకటించింది.