
బెంగుళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచులో 2 పరుగుల తేడాతో చెన్నైను చిత్తు చేసింది. సేఎస్కే యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే (94) వీరోచిత ఇన్సింగ్స్‌తో పాటు జడేజా (77) రాణించడంతో చెన్నై గెలిచేలా కనిపించింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి చెన్నైను దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో ఆయూష్‌తో పాటు మరో యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రేవిస్‌ను ఔట్ చేయడంతో ఆర్సీబీ తిరిగి రేసులోకి వచ్చింది.
చెన్నై విజయానికి చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సి ఉండగా బౌలర్ యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్స్ విరాట్ (62), జాకబ్ బెతెల్ (54) రాణిచంగా.. చివర్లో షఫర్డ్ మెరుపు హాఫ్ సెంచరీ (53) సాధించారు. అనంతరం ఛేదనకు దిగిన సీఎస్కే 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆయూష్ మాత్రే (94), జడేజా (77) రాణించారు.
214 పరుగుల ఛేదనకు దిగిన సీఎస్కేకు మంచి ఓపెనింగ్ లభించలేదు. ఓపెనర్ ఆయూష్ మాత్రే అద్భుతంగా రాణించగా.. మరో ఓపెనర్ రషీద్ (14) త్వరగా పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సామ్ కరాన్ (5) తీవ్రంగా నిరాశపర్చాడు. ఈ దశలో ఓపెనర్ ఆయూష్ మాత్రేతో జతకట్టిన జడేజా ఇన్సింగ్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఆయుష్ మాత్రే, జడేజా ఆర్సీబీ బౌలర్లను చెడుగుడు ఆడారు. బౌలర్ ఎవరన్నది చూడకుండా ఎడాపెడా బౌండరీలు బాదారు. వీరిద్దరూ రాణించడంతో సేఎస్కే విజయం దిశగా సాగింది.
ఈ క్రమంలో 16 ఓవర్ వేసిన ఎంగిడి చెన్నైను దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో సెంచరీకి చేరువలో ఉన్న మాత్రే (94), యంగ్ బ్యాటర్ బ్రెవిస్‌ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆర్సీబీ మళ్లీ రేసులోకి వచ్చింది. ఇక్కడి నుంచి మళ్లీ పుంజుకున్న ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చివర్లో జడేజా (77), ధోనీ (12) గెలిపించేందుకు ప్రయత్నించారు. చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సి ఉండగా.. భారీ షాట్ కొట్టే క్రమంలో ధోని ఔట్ అయ్యాడు. చివర్లో దూబే ఓ సిక్స్ కొట్టి మ్యాచును రసవత్తరంగా మార్చగా.. యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. ఆర్సీబీ బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. దయాల్, కృనాల్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, జాకబ్ బెతెల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. చెన్నై బౌలర్లను చితకబాది పవర్ ప్లేలో 71 రన్స్ పిండుకున్నారు. పవర్ ప్లే తర్వాత కూడా ఇదే దూకుడును కొనసాగించారు. వేగం ఆడే క్రమంలో 9 ఓవర్లో బెతెల్ (54) మతీశ పతిరణ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
బెతెల్ ఔట్ అయ్యాక కోహ్లీ గేర్ మార్చి దూకుడుగా ఆడాడు. 33 బంతుల్లో 62 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్‌లో క్యాచ్ రూపంలో పెవిలియన్ చేరాడు. కోహ్లీ, బెతెల్ ఉన్నంతసేపు పరుగులు పెట్టిన స్కోర్ బోర్డు.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అంచనాల మేర రాణించకపోవడంతో మందగించింది. పడిక్కల్ 17, కెప్టెన్ పటిదార్ 11, జితేష్ శర్మ 7 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చారు. మిడిల్ ఓవర్లలో చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోన్న ఆర్సీబీ.. కనీసం 200 పరుగులు అయినా చేస్తోందా అనిపించింది.
కానీ చివర్లో ఆల్ రౌండర్ రొమారియో షెఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చెన్న బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 14 బంతుల్లో 6 సిక్సులు, 4 ఫోర్లు బాది మెరుపు హాఫ్ సెంచరీ (53) చేయడంతో ఆర్సీబీ 200 పరుగుల మార్క్‌ను దాటింది. చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ 3, సామ్ కరన్ 1, నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ ఫే ఆఫ్స్ కు చేరుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.