ముంబై: కెప్టెన్సీ వదులుకున్నా ఇప్పటికీ జట్టులో ఓ నాయకుడిగా ఉంటూ టీమ్‌ను విజయం వైపు నడిపిస్తానని ఆర్‌సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఐపీఎల్ 15వ సీజన్‌కు సిద్ధమైన విరాట్ ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నాడు. ఎవరైనా తమ కోసం కొంత సమయాన్ని కేటాయించుకుని.. దీర్ఘంగా ఆలోచించి ముందుకెళ్లడం తెలివైన పని అన్నాడు. ఇంతకుముందు తాను చేయాల్సి ఉన్న చాలా విషయాలను గమనించలేదని.. అలాంటి వాటిని మరోసారి చేయడానికి నాకు అవకాశం ఉందని వెల్లడించాడు. ఆ విషయాల్ని గుర్తించి వాటిలో మెరుగయ్యేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. క్రికెట్ ఎప్పటికీ తనలో సజీవంగా ఉండాలని కోరుకుంటానని తెలిపాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకొనే విషయంలో బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్న కోహ్లీ.. ఒక ప్లేయర్‌గా ఫీల్డ్‌లో అత్యుత్తమంగా లేకపోతే, తనకు బాధ్యత లేదని అందరూ అనుకుంటారని వ్యాఖ్యానించాడు. డుప్లెసిస్ తో చాలా కాలంగా స్నేహం ఉందని.. అతడు జట్టును నడిపే తీరు నచ్చుతుందని కోహ్లీ అన్నాడు.
