
- 17 ఏండ్ల ఆయుష్ పోరాటం వృథా
- రాణించిన షెఫర్డ్, కోహ్లీ, బెథెల్, ఎంగిడి
బెంగళూరు: ఐపీఎల్‌లో మరో యంగ్‌స్టర్ తన తడాఖా చూపెట్టాడు. 14 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ సెంచరీతో సృష్టించిన సంచలనాన్ని మరిచిపోకముందే మరో కుర్రాడు కేక పుట్టించాడు. సీఎస్కే బుడ్డోడు, 17 ఏండ్ల ఆయుష్ మాత్రే (48 బాల్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 94) చిచ్చరపిడుగల్లే చెలరేగాడు. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో అతనికి తోడు రవీంద్ర జడేజా (45 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 నాటౌట్) కూడా ఆకట్టుకున్నా చివర్లో ఒత్తిడికి చిత్తయిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఓడింది.
ఫీల్డింగ్‌లో ఫెయిలైనా ఆఖర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎనిమిదో విక్టరీతో టాప్ ప్లేస్‌కు వచ్చింది. శనివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 రన్స్ తేడాతో చెన్నైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. హైస్కోరింగ్ పోరులో తొలుత బెంగళూరు20 ఓవర్లలో 213/5 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ ( 33 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 62), బెథెల్ (33 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 )తో పాటు చివర్లో రొమారియో షెఫర్డ్ (14 బాల్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 53 నాటౌట్) మెరుఫు ఫిఫ్టీ కొట్టాడు. ఛేజింగ్‌లో సీఎస్కే 20 ఓవర్లలో 211/5 స్కోరు చేసి ఓడింది. లుంగి ఎంగిడి మూడు వికెట్లు పడగొట్టాడు. షెఫర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచాడు.
ఆర్సీబీ ధనాధన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ స్టార్టింగ్ నుంచే దుమ్మురేపింది. కోహ్లీ సూపర్ ఫామ్ కొనసాగించగా.. కొత్త ఓపెనర్ జాకబ్ బెథెల్ కూడా దంచికొట్టాడు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే బెథెల్ హ్యాట్రిక్ ఫోర్లతో విజృంభించాడు. మరోవైపు తన స్టయిల్‌కు భిన్నంగా విరాట్ ఆరంభం నుంచే టాప్ గేర్‌లోకి వెళ్లాడు. ఖలీల్ బౌలింగ్‌లోనే వరుసగా రెండు సిక్సర్లతో చిన్నస్వామి స్టేడియాన్ని హోరెత్తించాడు. కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్లో జడేజా, పతిరణ ఒకరినొకరు ఢీకొని బెథెల్ క్యాచ్‌ను డ్రాప్ చేశారు. అప్పటికి 27 రన్స్ వద్ద ఉన్న జాకబ్ ఈ చాన్స్‌ను సద్వినియోగం చేసుకున్నాడు.
జడేజా బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌తో ఫోర్ కొట్టిన బెథెల్ ఐపీఎల్‌లో తొలి ఫిఫ్టీ అందుకున్నాడు. పదో ఓవర్లో అతడిని ఔట్ చేసిన పతిరణ తొలి వికెట్‌కు 97 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత చెన్నై బౌలర్లు లెంగ్త్ మార్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ రన్స్ అడ్డుకున్నారు. జడేజా బౌలింగ్‌లో సిక్స్, రెండు ఫోర్లతో మరో ఫిఫ్టీ అందుకున్న విరాట్‌ను.. సామ్ కరన్ స్లో బాల్‌తో బోల్తా కొట్టించాడు. ఇక్కడి నుంచి సీఎస్కే బౌలర్లు కట్టడి చేయడంలో 12వ ఓవర్లకు 121/2తో నిలిచిన ఆర్సీబీ పడిక్కల్ (17), పటీదార్ (11), జితేష్ (7) వికెట్లు కోల్పోయి 18 ఓవర్లకు 159 /5తో నిలిచింది.
మాత్రే, జడ్డూ దంచినా
భారీ టార్గెట్ ఛేజింగ్‌ను సీఎస్కే మెరుపు వేగంతో ఆరంభించినా చివర్లో ఒత్తిడికి చిత్తయి విజయాన్ని చేజార్చుకుంది. యంగ్ ఓపెనర్ ఆయుష్ మాత్రే మాత్రం అసాధారణ షాట్లతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ షేక్ రషీద్ (14)తో తొలి వికెట్‌కు 51 రన్స్ జోడించి మంచి పునాది వేశాడు. భువనేశ్వర్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా 4,4,4,6,4,4తో 26 రన్స్ రాబట్టిన మాత్రే ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. వరుస ఓవర్లలో రషీద్, కరన్ (5) ఔటైనా తను వెనక్కు తగ్గలేదు. జడేజా తోడుగా దూకుడు కొనసాగించాడు. క్రునాల్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతను సుయాశ్ ఓవర్లో సింగిల్‌తో 24 బాల్స్‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు. షెఫర్డ్ బౌలింగ్‌లో 6,6,4తో ఆకట్టుకోవడంతో సగం ఓవర్లకు సీఎస్కే 106/2 స్కోరు చేసింది. జడేజా సైతం పవర్‌ఫుల్ షాట్లతో ఎదురుదాడి చేస్తూ 29 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
భువీ బౌలింగ్‌లో సిక్స్‌తో 90ల్లోకి వచ్చిన మాత్రే.. యశ్ దయాల్ బౌలింగ్‌లో ఇచ్చిన టఫ్ క్యాచ్‌ను పటీదార్ డ్రాప్ చేశాడు. అదే ఓవర్లో జడేజా సింపుల్ క్యాచ్‌ను ఎంగిడి అందుకోలేకపోయాడు. కానీ, తర్వాతి ఓవర్లో ఎంగిడి వరుస బాల్స్‌లో మాత్రే, బ్రేవిస్ (0)ను ఔట్ చేసి ఆర్సీబీని రేసులోకి తెచ్చాడు. అదే ఓవర్లో జడ్డూ భారీ సిక్స్‌తో తమ జట్టును రేసులో నిలిపాడు. 18వ ఓవర్లో సుయాశ్ ఆరు రన్సే ఇవ్వడంతో చెన్నై విజయ సమీకరణం 12 బాల్స్‌లో 29 రన్స్‌గా మారి ఉత్కంఠ రేగింది.
భువీ వేసిన తర్వాతి ఓవర్ తొలి బాల్‌కే జడ్డూ క్యాచ్‌ను కోహ్లీ వదిలేయగా అది బౌండ్రీ దాటింది. ధోనీ (12) ఓ సిక్స్ రాబట్టడంతో చివరి ఓవర్లో చెన్నైకి 15 రన్స్ అవసరం అయ్యాయి. తొలి రెండు బాల్స్‌కు రెండు సింగిల్స్ ఇచ్చిన దయాల్.. మూడో బాల్‌కు ధోనీని ఎల్బీ చేశాడు. నాలుగో బాల్‌కు శివం దూబే (8 నాటౌట్) సిక్స్ కొట్టాడు. అది నో బాల్ కావడంతో చెన్నైదే విజయం అనిపించింది. కానీ ఫ్రీ హిట్ సహా చివరి మూడు బాల్స్‌కు మూడే రన్స్ ఇచ్చిన దయాల్ ఆర్సీబీని గెలిపించాడు.
రొమారియో ర్యాంపేజ్.. చివరి రెండు ఓవర్లలోనే 54 రన్స్
సీఎస్కే బౌలర్లు పుంజుకోవడంతో ఆర్సీబీ 180 స్కోరు చేస్తే గొప్పే అనిపించింది. కానీ, చివరి రెండు ఓవర్లలో షెఫర్డ్ పెను విధ్వంసం సృష్టించాడు. ఖలీల్ వేసిన 19వ ఓవర్లో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లతో చితక్కొట్టి ఏకంగా 33 రన్స్ రాబట్టాడు. పతిరణ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో విజృంభించిన అతను 14 బాల్స్‌లోనే ఫిఫ్టీ అందుకొని స్కోరు 210 దాటించాడు. టిమ్ డేవిడ్ (2 నాటౌట్)తో ఆరో వికెట్‌కు 15 బాల్స్‌లో 56 రన్స్ జోడిస్తే అందులో డేవిడ్ చేసింది రెండు రన్స్ మాత్రమే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఐపీఎల్‌లో రొమారియో రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో కేఎల్ రాహుల్, కమిన్స్ రికార్డు సమం చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లలో 213/5 (కోహ్లీ 62, బెథెల్ 55, రొమారియో 53 *, పతిరణ 3/36)
చెన్నై: 20 ఓవర్లలో 211/5 (మాత్రే 94, జడేజా 77*, ఎంగిడి 3/30)