పాపం .. ఆర్సీబీ ఓడిపోయిందని బోరున ఏడ్చేసింది

పాపం .. ఆర్సీబీ ఓడిపోయిందని బోరున ఏడ్చేసింది

ఐపీఎల్ 2023లో భాగంగా  చిన్నస్వామి స్టేడియం వేదికగా ఏప్రిల్ 10 సోమవారం రోజున  లక్నో సూపర్ జెయింట్,రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది.  ఈ ఆసక్తికరమైన పోరులో లక్నో జట్టు కేవలం ఒక వికెట్ తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో 212 పరుగులు చేసినప్పటికీ బెంగళూరు జట్టు గెలవకపోవడంతో ఆ జట్టు ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.  స్టేడియంలో ఉన్న ఓ యువతి అయితే బాధను తట్టుకోలేక ఏకంగా ఏడ్చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో బెంగళూరు ఒకటి.. ఇప్పటివరకు ఈ జట్టుకు ట్రోఫీ గెలుచుకోలేకపోయినప్పటికీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. 

213 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ..ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. కేవలం 1 పరుగు వద్ద కైల్ మేయర్స్ పెవలియన్ చేరాడు. ఆ తర్వాత 23 పరుగుల వద్ద లక్నో వరుసగా వికెట్లు కోల్పోయింది. దీపక్ హుడా, కృనాల్ పాండ్యాలు ఔటయ్యారు. దీంతో లక్నో కష్టా్ల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ తో కలిసి స్టోయినీస్ జట్టును ఆదుకున్నాడు. నాల్గో వికెట్ కు 75 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో స్టోయినీస్ 30 బంతుల్లో 65 పరుగులు సాధించాడు. అయితే ఈ సమయంలో స్టోయినీస్ ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు. దీంతో లక్నో 105 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. 

ఈ సమయంలో జట్టును గెలిపించే బాధ్యతను నికోలస్ పూరన్ నెత్తిన వేసుకున్నాడు. బెంగుళూరు బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 7 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. ఇతనికి ఆయుష్ బదోని (30) సహకారం అందించాడు. అయితే చివర్లో లక్నో వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ దశలో మ్యాచ్ ఉత్కంఠకు చేరుకుంది. అయితే చివరి బంతికి ఆవేశ్ కాన్ పరుగు తీసి లక్నోను గెలిపించాడు.