ఆర్టీఏ అధికారుల చూపంతా చెక్ పోస్టుల వైపే…

ఆర్టీఏ అధికారుల చూపంతా చెక్ పోస్టుల వైపే…

రాష్ట్రంలో చెక్​పోస్టులకు ఫుల్లుగా గిరాకీ కనిపిస్తోంది. ఆర్టీఏ అధికారులు, సిబ్బంది చాలా మంది చెక్‌‌పోస్టుల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటికి బదిలీ అయ్యేందుకు, ప్రమోషన్‌‌పై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రూ.20 లక్షల వరకు ముట్టజెప్తున్నారు. పని తక్కువగా ఉండటం, బాగా ‘పై సంపాదన’ఉండటమే దీనికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో చెక్‌‌పోస్ట్‌‌ల వద్ద సిబ్బంది అవసరం లేకున్నా కూడా బదిలీలు, ప్రమోషన్లు జరిగిపోతున్నాయి. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో సిబ్బంది, అధికారుల కొరత వేధిస్తోంది. ఆఫీసుల్లో సరిగా పనులు జరగడం లేదు. ఈ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

అందుకే పోతున్నరు..!

రాష్ట్రవ్యాప్తంగా 15 చెక్‌‌పోస్టులు ఉన్నాయి. ఇందులో రెండు సమీకృత చెక్‌‌పోస్ట్‌‌లు కాగా.. మిగతావాటిని రవాణాశాఖ నిర్వహిస్తోంది. ఇందులో కామారెడ్డి, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడంలలో రెండు చొప్పున, నిజామాబాద్‌‌, ఆదిలాబాద్‌‌, సంగారెడ్డి, నిర్మల్‌‌, కొమురం భీం, జోగులాంబ, మహబూబ్‌‌నగర్‌‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో చెక్‌‌పోస్టు ఉన్నాయి. వీటిల్లో పనిచేసేందుకు అధికారులు, సిబ్బంది ఉత్సాహం చూపుతున్నారు. చెక్​పోస్టుల్లో సిబ్బంది ఎక్కువగా ఉండటంతో పనిభారం తక్కువగా ఉంటోంది. అదే ఆర్టీఏ కార్యాలయాల్లో పని ఎక్కువ. పైగా చెక్​పోస్టుల వద్ద ‘అదనపు సంపాదన’ ఊరిస్తోంది. చెక్​పోస్టుల వద్ద వాహనాల తనిఖీల సమయంలో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఎంవీఐలకు రోజుకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయలదాకా చేతికి అందుతున్నాయని సమాచారం. దీంతో బదిలీలు, ప్రమోషన్ల పేరుతో చెక్‌‌పోస్ట్‌‌లకు వెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని  చెబుతున్నారు. ఇందుకోసం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ముట్టజెప్తున్నారని అంటున్నారు. చెక్‌‌ పోస్ట్‌‌ను బట్టి ఈ మొత్తం మరింత ఎక్కువగా కూడా ఉంటోంది. ‘‘ఆర్టీఏ కార్యాలయాల్లో నిత్యం హడావుడి ఉండేది. చెక్‌‌పోస్ట్‌‌ వద్ద సరిపడా సిబ్బంది, అధికారులు ఉన్నారు. వారానికోసారి వచ్చి ముఖం చూపిస్తే సరిపోతుంది. అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉన్నారు. నెలకు ఐదారు సార్లు నా వంతు వస్తుంది. నా వాటా నాకుంటుంది’’.. అని ఓ చెక్‌‌పోస్ట్‌‌ వద్ద పనిచేసే ఎంవీఐ తన తోటివారివద్ద వ్యాఖ్యానించడం గమనార్హం.

అక్కడ ఫుల్‌‌.. ఇక్కడ నిల్‌‌..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో అధికారుల కొరత ఉంది. 53 రకాల ఆన్‌‌లైన్‌‌ సేవలు అందించడానికి సరిపడా సిబ్బంది లేరు. దీంతో సరిగా పనులు కావడం లేదు. 2016 అక్టోబర్‌‌ వరకు రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఆర్టీవోలు ఉండేవారు. తర్వాత జిల్లాల సంఖ్య 33కి పెరిగింది. అయినా కొత్త జిల్లాలకు ఆర్టీవోలు, ఇతర సిబ్బందిని నియమించలేదు. అప్పటికే ఉన్న పది మందికే మిగతా ఆఫీసుల బాధ్యతలు అప్పగించారు. ఆయా చోట్ల ఎంవీఐలు, లేదా అడ్మినిస్ట్రేషన్​ సీనియర్లను ఇన్​చార్జులుగా నియమించారు. మరీ కీలకమైన పనులు ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీవోలు సదరు కార్యాలయాలకు వెళ్తున్నారు. మిగతా సమయాల్లో పనులన్నింటినీ ఎంవీఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో నెట్టుకొస్తున్నారు. సిబ్బంది లేనిచోట ప్రైవేట్‌‌ వ్యక్తులను పెట్టుకుని పనిచేయించుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌‌లోని అన్ని కార్యాలయాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు
చెక్​పోస్టుల వద్ద మాత్రం అవసరానికి మించి సిబ్బంది ఉన్నారు. ఒక్కో చెక్‌‌పోస్టు దగ్గర ఇద్దరు, ముగ్గురు ఎంవీఐలతోపాటు, 10 మంది వరకు ఏఎంవీఐలు ఉన్నారు.