
- కలెక్టరేట్ లో ఆఫీసర్లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మీటింగ్
- కేంద్ర, రాష్ట్ర పథకాలు అందరికీ చేరేలా కృషి చేయాలని సూచన
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాను టీబీ, మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్‌లో జిల్లా ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో టీబీ పట్ల అవగాహన కల్పించాలన్నారు.
నల్గొండ జిల్లాలో కవులు, కళాకారులు, రచయితలు వివిధ రంగాల్లోని ప్రముఖులను టీబీ ముక్త్ భారత్‌లో భాగస్వాములను చేయాలన్నారు. టీబీని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి సూచించారు. టీబీ నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ ప్రోగ్రాంకు ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జిల్లాలో గాంజా నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
క్షేత్ర స్థాయిలో చివరి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లాలో వైద్యం, ఆరోగ్యం, విద్య పథకాల అమలు పట్ల ఆయన జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు.
పథకాలపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర గవర్నర్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలో శాంతి భద్రతలపై వివరాలు తెలియజేశారు.నల్గొండ జిల్లాలో టీబీ నివారణకు సలహాలు తీసుకోవడమే కాకుండా, జిల్లా యంత్రాంగంతో కలిసి పని చేస్తామని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి అన్నారు.
మిర్యాలగూడ ప్రాంతంలో ఆసియాలోనే అతి పెద్ద రైస్ మిల్లు ఇండస్ట్రీ ఉందని, దీనివల్ల వాతావరణ కాలుష్యం, టీబీ లాంటి వ్యాధులు సోకడానికి ఆస్కారం ఉందన్నారు. పట్టణాలలో గాంజా వాడకం ఎక్కువగా ఉందని, నివారించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, దేవరకొండ ఏసీపీ మౌనిక, డీఎఫ్ఓ రాజశేఖర్, రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్, జిల్లా అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.