ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఆందోళనొద్దు.. అర్హులందరికీ ఇండ్లు : మంత్రి సీతక్క

ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఆందోళనొద్దు.. అర్హులందరికీ ఇండ్లు : మంత్రి సీతక్క

ములుగు/ తాడ్వాయి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ విడతల వారీగా ఇండ్లు పంపిణీ చేస్తామని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం మంత్రి ములుగు జిల్లాలో పర్యటించి పలువురికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేశారు. ముందుగా కలెక్టరేట్​లో ఇంచర్ల శివారులో ఏర్పాటు చేయనున్న ఆయిల్ ఫాం ఫ్యాక్టరీకి భూములు అందజేసిన 41మంది రైతులకు ఎకో పార్క్​ సమీపంలో ప్రభుత్వ భూమిని కేటాయించగా, ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి రైతులకు పట్టాలు అందజేశారు. 

గోవిందరావుపేట మండలం మొట్లగూడెం పంచాయతీ పరిధి ప్రాజెక్టునగర్, తప్పమంచ, మొట్లగూడెంలలో రెండోవిడతలో భాగంగా 21మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. తాడ్వాయి మండలం వెంగళాపూర్​, గోనెపల్లిలో 8 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు అందించారు. అనంతరం నార్లాపూర్ లో 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి మార్కెట్​కమిటీ చైర్​పర్సన్​ రేగా కల్యాణితో కలిసి భూమిపూజ చేశారు. 

ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగకుండా ప్రభుత్వ భూమిని కేటాయించి పట్టాలు అందజేశామన్నారు. ఆయిల్​ ఫాం ఫ్యాక్టరీతోపాటు ఇంటిగ్రేటెడ్​స్కూల్, ఫారెస్ట్ ఎకో పార్కు నిర్మాణంతో ఈ ప్రాంతం రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్​ దివాకర, ఎస్పీ పి.శబరీశ్, అడిషనల్​ కలెక్టర్​ మహేందర్​ జీ, ఆర్డీవో వెంకటేశ్, డీపీవో దేవరాజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.