రిజర్వాయర్ల నిర్మాణం..జరిగేనా..? ప్రతి ఏడు తుమ్మిళ్ల చుట్టే రాజకీయాలు

రిజర్వాయర్ల నిర్మాణం..జరిగేనా..? ప్రతి ఏడు తుమ్మిళ్ల చుట్టే రాజకీయాలు
  •      రిజర్వాయర్లు లేకుండానే పంపింగ్ చేస్తుండడంతో ఆర్డీఎస్ రైతులకు కష్టాలు
  •      నాలుగున్నర ఏళ్ల తర్వాత మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణం కోసం జీవో
  •      రిజర్వాయర్లు వద్దంటున్న భూములు కోల్పోతున్న రైతులు
  •      ప్రతి ఏడు తుమ్మిళ్ల చుట్టే రాజకీయాలు

గద్వాల, వెలుగు : ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2017లో  రూ.783 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్ పనులు స్టార్ట్ చేసింది. కానీ రిజర్వాయర్లను మాత్రం నిర్మించలేదు. నాలుగున్నర ఏళ్ల తరువాత హడావుడిగా లిఫ్ట్ పరిధిలోని మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. జీవోలిచ్చి మూడు నెలలైనా ఇప్పటివరకు పనుల్లో పురోగతి కనిపించ లేదు. రెండు రోజుల నుంచి సర్వే అంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు. కేవలం ఎన్నికల కోసమే తుమ్మిళ్ల లిఫ్ట్ ను వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.  మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు వ్యతిరేకిస్తున్నారు.  ఒకవైపు భూ సేకరణ సమస్య, మరొకవైపు రైతుల అభ్యంతరాల నేపథ్యంలో  రిజర్వాయర్ పనులు జరిగేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒక పంపు ద్వారానే నీళ్లు

 అలంపూర్ నియోజకవర్గంలో  ఆర్డీఎస్, తుమ్మిళ్ల చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. అయినప్పటికీ రైతుల కష్టాలు తీరడం లేదు.   లిఫ్ట్ పనులు మాత్రమే చేశారు. ఇప్పటివరకు కేవలం ఒక పంపు ద్వారానే నీళ్లు ఇస్తున్నారు. రిజర్వాయర్లు నిర్మించకపోవడం, తుంగభద్రలో నీరు లేకపోవడంతో పంపులు బంద్ అవుతుండడంతో వేల ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి.  

ఓట్ల కోసం హడావుడిగా

ఓట్ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హడావుడిగా తుమ్మిళ్ల లిఫ్టును ప్రారంభించిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆర్డీఎస్ పరిధిలోని 40వ  డిస్ట్రిబ్యూటరీ చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే లక్ష్యంతో 2017 లో రూ. 783 కోట్లతో తుంగభద్ర నదిపై రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద  లిఫ్టును ఏర్పాటు చేసేందుకు  ప్రభుత్వం ముందుకు వచ్చింది.  మొదటి విడతలో రూ.162 కోట్లతో పంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో వేరే ప్రాజెక్టుకు వాడిన పాత పైపులు, మోటార్లను తీసుకువచ్చి హడావుడిగా ఒక పంపును ఏర్పాటు చేసి 2018లో దాని స్టార్ట్ చేశారు. మళ్లీ ఇప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. 

రిజర్వాయర్ల మాటేమిటి..?

ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు రెండు పంప్ లు, మల్లమ్మ కుంట, జూలకల్, వల్లూరు గ్రామాల దగ్గర మూడు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ హడావుడిగా కేవలం ఒక పంపును కంప్లీట్ చేసి ఆర్డీఎస్ కాలువలోకి పంపింగ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు వాటి కోసం 
భూసేకరణ చేయకపోవడం, రెండో పంప్ ను కూడా కంప్లీట్ చేయలేదు. దీంతో చివరి ఆయకట్టుకు నీళ్లు  అందే పరిస్థితి లేదు. 

మల్లమ్మకుంట రిజర్వాయర్ కి మాత్రమే జీవో

తుమ్మిళ్ల లిఫ్టులో మూడు రిజర్వాయర్లు కట్టాల్సి ఉండగా కేవలం మల్లమ్మకుంట రిజర్వాయర్ మాత్రమే కట్టాలని మూడు నెలల క్రితం  ప్రభుత్వం జీవో విడుదల చేసింది.  అప్పటి నుంచి ఎలాంటి పనులు జరగులేదు. కానీ రెండు రోజుల క్రితం సర్వేలు, మార్కింగ్ లంటూ హడావుడి చేస్తున్నారు.   కేవలం మల్లమ్మ కుంట రిజర్వాయర్ కి మాత్రమే జీవో ఇచ్చి మిగతా రెండింటికి జీవో ఇవ్వకపోవడం ఏంటని  రైతులు ప్రశ్నిస్తున్నారు.

పెరిగిన ఎస్టిమేషన్

 2017లో తుమ్మిళ్ల లిఫ్ట్ తో పాటు మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.783 కోట్లతో ఎస్టిమేషన్లు వేశారు. కానీ ఇప్పుడు  మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికే రూ . 496 కోట్లు ఖర్చు అవుతుందని ఆఫీసర్లు ఎస్టిమేషన్లు వేశారు. దీని కోసం 562 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని  పేర్కొన్నారు. పంప్ హౌస్ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి అన్ని పనులు చేసి ఉంటే కేవలం రూ. 783 కోట్లతోనే  పంపింగ్,  మూడు రిజర్వాయర్లు పనులన్నీ కంప్లీట్ అయ్యేవి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్మాణ కాస్ట్ భారీగా పెరిగిందని నిపుణులు
 చెబుతున్నారు.

రిజర్వాయర్ మాకొద్దు

ఈ భూములను నమ్ముకుని తాము బతుకుతున్నామని తమకు రిజర్వాయర్ వద్దని నిర్వాసిత రైతులు చెబుతున్నారు. ఈ మేరకు  మూడు నెలల క్రితం మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి జీవో జారీ చేసిన వెంటనే వడ్డేపల్లి మండలంలోని తనగల, పర్దీపురం  గ్రామాల రైతులు కలెక్టరేట్ ను ముట్టడించారు. సర్వే దగ్గర కూడా రైతులు ఆఫీసర్లను అడ్డుకున్నారు. ప్రస్తుతం భూములు కోల్పోతున్న రైతులు అందరివీ ఎకరా, అర ఎకరా పొలాలేనని, తమ కడుపు కొట్టొద్దంటూ వేడుకుంటున్నారు.

సర్వే చేస్తున్నాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు మల్లమ్మకుంట రిజర్వాయర్ పనుల కోసం సర్వే చేస్తున్నాం. భూములు ఎంతవరకు పోతున్నాయని మార్కింగ్ వేస్తున్నాం. మల్లమ్మ కుంట రిజర్వాయర్ కు మాత్రమే 562 ఎకరాలు సేకరించాలని ఉంది. రూ. 496 కోట్లతో ఎస్టిమేషన్లు పంపించాం. 

విజయ భాస్కర్ రెడ్డి ,ఈ ఈ ఆర్డీఎస్