రాముడు భార‌తీయుడు కాదు.. నేపాలీ: నేపాల్ ప్ర‌ధాని ఓలీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

రాముడు భార‌తీయుడు కాదు.. నేపాలీ: నేపాల్ ప్ర‌ధాని ఓలీ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

హిందూ ఆరాధ్య దైవం శ్రీరాముడు భార‌తీయుడు కాద‌ట‌.. ఆయ‌న పుట్టింది భార‌త్‌లో కానేకాదు.. నేపాల్‌లోనేన‌ని అంటూ ఆ దేశ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ వింత‌వాద‌న తెర‌పైకి తెచ్చారు. భార‌త భూభాగాలైన‌ లిపూలేఖ్, కాలాపానీ ప్రాంతాల‌ను నేపాల్ మ్యాప్‌లో పొందుప‌రుస్తూ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేసి రెండు దేశాల మ‌ధ్య అగ్గిరాజేసిన ఓలీ. ఇప్పుడు మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ ఇన్నాళ్లుగా నేపాల్‌ను సాంస్కృతిక దోపిడీ చేస్తూ వ‌చ్చింద‌ని ఆరోపించారాయ‌న‌. ఇంత కాలం పాటు సీతమ్మ‌ను భార‌తీయుడైన రాముడికి ఇచ్చామ‌ని అనుకుంటూ వ‌చ్చామ‌ని, కానీ చ‌రిత్ర‌లోని వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంద‌ని, రాముడు కూడా నేపాలీనేని అన్నారు. శ్రీరామ జ‌న్మ‌భూమిగా చెప్పే నిజ‌మైన‌ అయోధ్య నేపాల్‌లోని బిర్గంజ్ ప్రాంతంలో ఉంద‌ని చెప్పారు. భార‌త్‌లోని అయోధ్య కృత్రిమంగా క్రియేట్ చేసింద‌ని ఆరోపించారు ఓలీ. రామాయ‌ణాన్ని సంస్కృతం నుంచి నేపాలీ భాష‌లోకి అనువ‌దించిన నేపాల్ క‌వి భానుభ‌క్తాచార్య 206వ జ‌యంతి సంద‌ర్భంగా నిన్న జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నేపాల్ ప్ర‌ధాని ఓలీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.