ఒక్క సర్వే నంబర్​కు 70 బై నంబర్లు

ఒక్క సర్వే నంబర్​కు 70 బై నంబర్లు

గుంట, 2 గుంటల భూమి రిజిస్ట్రేషన్​తో పెరుగుతున్న బై నంబర్ల సంఖ్య 
రియల్టర్లకు అనుకూలంగా ధరణి పోర్టల్ 

198/7/c/2/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/1/2. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామంలో ఒక సర్వే నంబర్ ఇది. ఈ సర్వే నంబర్‌లో ఉన్న భూమి 2 గుంటలు. ఎకరాల్లో ఉన్న వ్యవసాయ భూమిని గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ ఇన్ని బై నంబర్లు క్రియేట్ చేయాల్సి వచ్చింది. నాలా కన్వర్షన్‌కు పైసలు కట్టి, తర్వాత లే ఔట్ పర్మిషన్ తీసుకుని లక్షల్లో ఖర్చు చేసి వెంచర్ చేయడానికి బదులు ఇలా ఫామ్ ల్యాండ్స్ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిజినెస్ మొదలుపెట్టారు. ధరణి పోర్టల్ కూడా ఇలాంటి రిజిస్ట్రేషన్లకు అనుకూలంగా ఉంది

హైదరాబాద్, వెలుగు: హైవేల వెంట, పట్టణాలకు శివారులో వ్యవసాయ భూములకు సింగిల్ డిజిట్ లో ఉన్న సర్వే నంబర్లు కాస్తా పదుల సంఖ్యలో బై నంబర్లుగా మారిపోతున్నాయి. పట్టాదారులు కూడా ఒకటికి నాలుగుసార్లు లెక్కిస్తే తప్పా ఆ బై నంబర్ల లెక్క చిక్కడం లేదు. ఫామ్ ల్యాండ్స్ పేరిట రియల్ ఎస్టేట్ దందా సాగుతున్న ఏరియాల్లోని వివరాలను ధరణి పోర్టల్ లో చెక్ చేస్తే ఒక్కో సర్వే నంబర్.. బై నంబర్లతో చాంతాడంత లిస్టు కనిపిస్తోంది. అన్ని అనుమతులు తీసుకుని లే ఔట్ వెంచర్ వేస్తే లక్షలాది రూపాయలు ఖర్చవుతాయని, వ్యవసాయ భూమినే ఫామ్ ప్లాట్లుగా చేసి అమ్మితే పెద్దగా ఖర్చే లేదని రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఒకరు వెల్లడించారు. 

గుంట, రెండు గుంటలకు రిజిస్ట్రేషన్లు.. 
గ్రామాలు, పట్టణాల్లో ప్రతి వ్యవసాయ భూ విస్తీర్ణానికి ఓ సర్వే నంబర్ ఉంటుంది. ఒక సర్వే నంబర్ లో భూమి పంపకాలు జరిగితే రెవెన్యూ అధికారులు బై నంబర్లు వేస్తుంటారు. సాధారణంగా ఈ బై నంబర్ లోని సంఖ్య పదికి మించి ఉండవు. కానీ ఫామ్ ప్లాట్ల పేరిట రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారులు ఒక్కో ఎకరంలో రోడ్లు పోను 20 నుంచి 25 గుంటల వరకు ఒకటి, రెండు గుంటల చొప్పున అమ్మేస్తున్నారు. ఇలా ఒక సర్వే నంబర్ లో ఐదు నుంచి పదెకరాల భూమిని 50 నుంచి100 ఫామ్ ప్లాట్లుగా చేసి అమ్మాల్సి వస్తే తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఒక్కో గుంట భూమికి ఇచ్చే బై నంబర్ల సంఖ్యను పెంచుతూ పోతున్నారు. దీంతో ఒక్కో సర్వే నంబర్ లో బైనంబర్ల సంఖ్య ప్లాట్ల సంఖ్యను బట్టి పెరుగుతూ పోతోంది.