
పంట పొలాలన్నీ ప్లాట్లయితున్నయ్
మొన్న మొన్నటిదాకా టన్నులు టన్నులు కూరగాయలు పండిన పచ్చటి పొలాలవి.. ఇప్పుడు చెట్టూలేక.. మొక్కా లేక బీడు భూముల్లా కనిపిస్తున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్.. కొత్త జిల్లాలతో వచ్చిన ఎఫెక్ట్.. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇదే పరిస్థితి. పంట భూములన్నీ ప్లాట్లుగా మారిపోయాయి, మారిపోతున్నాయి. కొత్త జిల్లా కేంద్రాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో భూములకు డిమాండ్ పెరగడం, మంచి రేట్లు రావడంతో పల్లెల్లో సైతం రియల్ వెంచర్లు వెలిశాయి. దీని ఎఫెక్ట్ ముఖ్యంగా కూరగాయల సాగుపై పడింది.
మూడేళ్లుగా రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా తగ్గుతోంది. 2016-–17లో 4 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండుతుండగా.. ఇప్పుడది 3 లక్షల ఎకరాలకు పరితమైంది. అంటే మూడేళ్లలోనే ఏకంగా లక్ష ఎకరాల్లో కూరగాయల సాగు తగ్గిపోయింది. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తే తప్ప మన అవసరాలు తీరడం లేదు. విత్తనాల కొరత, కూలీలు దొరక్కపోవడం, కోతుల బెడద వంటి కారణాలతో కూడా కూరగాయల సాగు తగ్గినా ‘రియల్’ ప్రభావమే ప్రధానంగా కన్పిస్తోంది. సాగు తగ్గిపోయిన లక్ష ఎకరాల్లో దాదాపు 60 వేలకుపైగా ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారినట్టు అంచనా.
‘పెద్ద’ సాగు చిన్నబోయె..
కర్నాటకలోని రాయ్‌చూర్, మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతాల్లో కొందరు రైతులు కనీసం 25 నుంచి 50 ఎకరాల్లో కూరగాయల సాగు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో ఇంతకుముందు పెద్ద రైతులు కూడా ఇలాగే పెద్ద ఎత్తున సాగు చేసేవారు. కానీ ఇప్పుడా ఆ భూములన్నీ రియల్ ఎస్టేట్, ఇతర అవసరాలకు మళ్లాయి. గతంలో 15 నుంచి -20 ఎకరాల్లో కాయగూర పంటలు సాగు చేసిన కొందరు రైతులు ఇప్పుడు రెండు, మూడెకరాల్లోనే సాగు చేస్తున్నారు. ఈ జిల్లాలో గతంలో 15 వేల ఎకరాల్లో కూరగాయలు, పూలు, పండ్ల తోటలు వేసేవారు. ఇప్పుడు వాటి సాగు 7 వేల ఎకరాలకే పరిమితమైంది. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా సాగు బాగా తగ్గిపోయింది. దీంతో టమాటా, పచ్చి మిర్చి, బెండ, దొండ, బీర వంటి వెజిటబుల్స్ ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రాష్ట్రంలో మరో లక్ష ఎకరాల్లో కూరగాయల సాగు జరిగితే తప్ప మన అవసరాలు తీరేలా కన్పించడం లేదు.
దిగుమతులే దిక్కు
హైదరాబాద్ అవసరాలకు తగ్గట్టుగా కూరగాయలు అందడం లేదు. సిటీ అవసరాల్లో కేవలం 40 శాతం మాత్రమే మన రాష్ట్రం నుంచి వస్తున్నాయి. మిగతా 60 శాతం కూరగాయలను మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ , ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. సాధారణంగా రాష్ట్రంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు కూరగాయల సాగు ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈ నెలల్లోనూ 50 శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి కావడం గమనార్హం. వేసవి, అన్‌సీజన్‌లో అయితే ఇతర రాష్ట్రాల నుంచి 70 శాతం కూరగాయాలు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్‌లోని ఒక్క బోయిన్‌పల్లి మార్కెట్‌కే సీజన్‌లో రోజుకు 1600 టన్నులు, అన్‌సీజన్‌లో 1200 టన్నుల కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇతర మార్కెట్లు, రైతు బజార్లు కలిపితే దిగుబడి రోజూ 2 వేల టన్నులు దాటుతోందని మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ నుంచి అన్ని రకాల కూరగాయాలు దిగుమతి అవుతుండగా యూపీ నుంచి ఆలుగడ్డ, మహారాష్ట్ర, రాజస్థాన్ నుంచి ఉల్లిగడ్డ, కర్నాటక నుంచి క్యాప్సికమ్, టమాటా దిగుమతి అవుతున్నాయి.
సబ్సిడీ విత్తనాలేవీ?
గతంలో రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ విత్తనాలు అందేవి. ఇప్పుడు ఇలాంటి ప్రోత్సాహకాలు లేక పోవడం, బహిరంగ మార్కెట్‌లో కూరగాయల విత్తనాల ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులు వాటి సాగుకు మొగ్గు చూపడం లేదు. కూలీల కొరత కూడా తీవ్రంగా ఉంది. బెండ, గోరుచిక్కుడు, వంకాయ, టమాటా, పచ్చి మిర్చి వంటి పంటలన్నీ కూలీలతోనే ముడిపడి ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలంతా ఉపాధి స్కీం పనులకే వెళ్తున్నారు. దీంతో కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ దొరికినా కూలీ ధరలు ఎక్కువగా ఉంటున్నాయని, పంటలు గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు. మరికొన్ని చోట్ల కోతుల బెడద వేధిస్తోంది. పూత, పిందె దశలో తోటలను కోతులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మహేశ్వరం, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాద్‌నగర్, ఘట్కేసర్, కీసరల్లో మూడేళ్ల కింద మస్తు కూరగాయలు పండేవి. ఇప్పుడు చాలాచోట్ల రియల్ వెంచర్లు కన్పిస్తున్నాయి!
ఉమ్మడి నల్లగొండ జిల్లా యాదాద్రి, బీబీనగర్‌లో కూడా కూరగాయ తోటలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా చదును చేసిన భూములు.. ప్లాట్లుగా మారిన పొలాలే కనబడుతున్నాయి!
ట్రాన్స్‌పోర్టుతో పెరుగుతున్న రేట్లు
వెజిటబుల్స్ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుండటంతో రవాణా చార్జీల భారం కూడా కూరగాయల రేట్లపై పడుతోంది. స్థానికంగా పండిన కూరగాయలను సమీపంలోని టౌన్లకు తీసుకెళ్లాలంటే వందకు మించి రవాణా చార్జీలు కావు. కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటే ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రావాలంటే ఒక్కో లారీ లోడుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల దాకా ఖర్చవుతుంది. అదే కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వస్తే రూ.30 నుంచి రూ.40 వేల దాకా అవుతుంది. ఈ ఖర్చులు కూడా కలిపి అమ్ముతుండడంతో కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి.
రేట్లు పెరిగాయి.. అమ్ముతున్నరు
కొత్త జిల్లాలు అయినంక ఊళ్లల్ల భూములు రేట్లు బాగా పెరిగాయి. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని మడికొండ, చిన్న పెండ్యాల, కుల్కచర్ల, హసన్‌పర్తిలో కూరగాయలు పండించే రైతులు ధరలు ఎక్కువవడంతో భూముల్ని అమ్ముకుంటున్నరు. గతంలో రూ.40 లక్షలకు ఎకరం ఉంటే ఇప్పుడు కోటికిపైనే అమ్ముతున్నరు. – గుర్ర రవి, రియల్ ఎస్టేట్ వ్యాపారి, హన్మకొండ
ఆ రోజులు పోయినయ్
కూరగాయలు పండించుకునే రోజులు పోయినవి. దానికి బదులు భూముల్ని అమ్ముకునే రోజులు వచ్చినయి. కొత్తగా జిల్లా కావడంతో మా ఊర్లలోని భూములన్నీ ప్లాట్లు అయినయి.- నారాయణ, రైతు, బషీరాబాద్, రంగారెడ్డి
గిట్టుబాటు అయితలె.. అందుకే ప్లాట్లు చేస్తున్నం
కూరగాయలు వేస్తే గిట్టుబాటు అయితలె. అందుకే భూములను ప్లాట్లు చేస్తున్నాం. జిల్లా కాక ముందు ఎకరం 5 లక్షల నుంచి 6 లక్షలు ఉండేవి. ఇప్పుడు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఉంది. – బి. శ్రీనివాస్, రైతు, పెద్దేముల్, వికారాబాద్ జిల్లా