రియల్ ఢమాల్.. పడిపోయిన రిజిస్ట్రేషన్లు.. మార్కెట్ నేలచూపులు

రియల్ ఢమాల్.. పడిపోయిన రిజిస్ట్రేషన్లు.. మార్కెట్ నేలచూపులు
  • ఇండ్లు, ఫ్లాట్లు, జాగలు, భూములు అమ్ముడుపోతలే
  •  111 జీవో ఎత్తేసిన ఏరియాలు, 
  • ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్ ప్రాంతాల్లోనూ ఇంతే
  • ఎలక్షన్ల నేపథ్యంలో అమ్మకానికి మస్తు భూములు
  • వందల ఎకరాలు గంపగుత్తగా బేరానికి పెట్టిన లీడర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేల చూపులు చూస్తున్నది. ఇండ్లు, ఫ్లాట్లు, ఖాళీ జాగలు అమ్ముడుపోవడం లేదు. వ్యవసాయ భూముల అమ్మకాల్లోనూ అదే పరిస్థితి. కరోనాతో ఓ ఏడాది భూముల అమ్మకాలు నెమ్మదించినా.. ఆ తర్వాత దాదాపు రెండేండ్లు రియల్ బూమ్ కొనసాగింది. కానీ మూడు నెలల నుంచి రాష్ట్రంలో భూములు, స్థిరాస్తి అమ్మకాలు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్), ఇటీవల 111 జీవో ఎత్తివేసిన ఏరియాల్లోనూ సేల్స్ సాగడంలేదు.

వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయించాలని అనుకున్న వాళ్లు కూడా.. వందల ఎకరాలను ధర తగ్గించి గంపగుత్తగా బేరానికి పెట్టినా కొనే దిక్కు లేదు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ సేల్స్ విషయంలో గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్లు తగ్గినట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. గతేడాది జూన్​లో ఈ సమయానికి 1.80 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్ జరగ్గా.. ఈసారి 75 వేలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. 

‘రియల్’ ఢమాల్

అంటే సగానికి పైగా తగ్గాయి. రానున్న రోజుల్లో అమ్మకాలు మరింత తగ్గుతాయని ఆఫీసర్లు భావిస్తున్నారు. అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా.. గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప కొత్త కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. అమ్ముకునే ప్రయత్నాల్లో లీడర్లు, వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వం తీరుతో సామాన్యులకు అందుబాటులో లేకుండా భూముల ధరలు అంతకంతకు పెరిగాయి. ఎక్కడ ఏం చేయబోతున్నారో రాష్ట్ర సర్కార్ ముందే కొందరికి లీకులు ఇవ్వడంతో ఆయా ప్రాంతాల్లో భూములను లీడర్లు, ప్రభుత్వానికి దగ్గర ఉండే బడా వ్యాపారవేత్తలు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. వాటి ధరలు కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ఇప్పుడు రియల్ బూమ్‌పై స్పష్టత లేదు.

మరోవైపు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. దీంతో కొనుగోలు చేసి పెట్టుకున్న భూములను లీడర్లు, వారి బినామీ వ్యాపారవేత్తలు ఎలక్షన్ల ఖర్చుల కోసం అమ్మే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్నటి దాకా అమాంతం ధరలు పెంచేసి కొనుగోళ్లు చేసిన వాళ్లే ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నారు. రేట్లు కోట్లలో ఉండటంతో మధ్య తరగతి, సామాన్యులు వాటిని ఆ రేటుకు తీసుకోలేని పరిస్థితి. ఇంకోవైపు కొందరు రియల్ వ్యాపారులు బిజినెస్ చేద్దామని స్థలాలు కొనేందుకు రెడీగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు.

వరుసగా ఎన్నికలు.. ముందు జాగ్రత్తలో వ్యాపారులు

త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో స్థిరాస్తి వ్యాపారులు, పెట్టుబడిదారులు భూములు కొనేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తున్నది. తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయోననే ఆలోచనతోనే వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు, సర్పంచ్‌, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఇలా వరుసబెట్టి ఎన్నికలు ఉన్నాయి. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డెవలపర్లు, పెట్టుబడిదారుల్లో ఎన్నికల మూడ్‌ వచ్చేసింది. కొంతమంది డెవలపర్లకు స్థానిక రాజకీయ నాయకులతో ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా నిధులను ఏర్పాటు చేస్తుంటారు. దీంతో ఆయా డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్​లు ప్రారంభించడం కంటే చేతిలో ఉన్న ప్రాజెక్ట్​లను విక్రయించడం మీదే దృష్టిసారిస్తున్నారు. దీంతో బల్క్‌ ల్యాండ్స్‌ కొనుగోళ్లు తగ్గాయని ఓ డెవలపర్‌ తెలిపారు.

రిజిస్ట్రేషన్లలో భారీగా తగ్గుదల

అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ భూముల విషయంలో గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గుదల నమోదైంది. అగ్రికల్చర్ భూముల విషయంలో ఈ ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1,47,401 అప్లికేషన్లు రిజిస్ట్రేషన్​, మ్యుటేషన్ కోసం వచ్చాయి. ఇందులో పార్టిషన్, సక్సెషన్, నాలా కింద వచ్చినవే దాదాపు 40 వేలు ఉన్నాయి. పెండింగ్​లో కొన్ని ఉన్నాయి. అంటే లక్ష డాక్యుమెంట్లు మాత్రమే అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. అదే గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు చూస్తే పార్టిషన్, సక్సెషన్, నాలా మినహాయించి 1.51 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 50 వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయి. నాన్ అగ్రికల్చర్ కింద సబ్ రిజిస్ర్టార్ ఆఫీసుల్లో గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ 16 దాకా 5.30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవ్వగా.. ఈసారి అది 4 లక్షల్లోనే ఉండిపోయింది. ఆదాయం కూడా స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్స్​తో ప్రతి నెల రూ.1,500 వస్తుందని అంచనా వేయగా.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో రూ.1,087 కోట్లు మాత్రమే వచ్చింది. మే, జూన్​లలోనూ అదే పరిస్థితి.

ఆ ప్రాంతాలు మునుగుతయని..!

మే రెండోవారం వరకు వెస్ట్ హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాల సబ్‌‌ రిజిస్ట్రేషన్‌‌ ఆఫీసులు కిటకిటలాడాయి. 111 జీవోను ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటినుంచి రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టాయి. 111 జీవో ఎత్తివేస్తున్నట్లు కేబినెట్ ప్రకటించాక రియల్ బూమ్ వస్తుందని అంతా భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. గత నెల 18న కేబినెట్ భేటీలో ఆ 84 గ్రామాల్లో నాలా, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్‌‌కు అనుమతిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు.   అక్కడ ఎలాంటి రూల్స్ ఉంటాయన్న దానిపై గందరగోళం నెలకొంది. హెచ్ఎండీఏ పరిధిలోని భూములకు ఉన్న రూల్స్‌‌ ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ,  ఉత్తర్వులు ఇవ్వలేదు. హెచ్ఎండీఏలోని రూల్స్ ఆ గ్రామాల్లో అమలు చేస్తే కోర్టులు, ఎన్జీటీ నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండడంతో కొనుగోళ్లు సాగడం లేదు.  

ఆ గ్రామాల్లో గ్రీన్​జోన్లు సహా వివిధ జోన్లు ఏర్పాటు చేస్తూ మాస్టర్ ప్లాన్ తయారు చేసే చాన్స్​ ఉంది. దీంతో ఎక్కడ ఏ జోన్ వస్తుందో తెలియని పరిస్థితి. జంట జలాశయాలకు సంబంధించిన ఏరియా కావడంతో.. భారీ వర్షాలు కురిసి, వరదలు వస్తే నీట మునుగుతామోననే ఆందోళన ఉంది. ఇక్కడ సర్కార్, అసైన్డ్, ఇతర ప్రభుత్వ సంబంధిత భూములు పోను లక్ష ఎకరాల ల్యాండ్ ఉన్నది.
ఆర్ఆర్ఆర్ ఎట్ల పోతుందో?
రీజినల్‌ రింగ్‌ రోడ్డు విషయంలోనూ రాష్ట్ర సర్కార్ తీరుతో రియల్ వ్యాపారుల్లో గందరగోళం నెలకొన్నది. ఆర్ఆర్ఆర్ ఆలైన్​మెంట్ విషయంలో రైతుల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అసలు మాస్టర్ ప్లాన్​ ప్రకారం కాకుండా.. అధికార పార్టీ లీడర్లు, బడా బాబుల నుంచి భూములను తాకకుండా.. వాటి పక్కన ఉన్న సాధారణ రైతుల భూముల మీదుగా వెళ్లేలా అలైన్‌మెంట్‌లో మార్పులు జరుగుతున్నాయి. దీంతో అసలు ఆర్ఆర్ఆర్ ఎలా వస్తుందనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. అప్పటికే  భూములు కొన్నోళ్లు వాటి విలువలను నాలుగైదు రెట్లు పెంచేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొనుగోలుదారులు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగం కలిపి 340 కిలో మీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణం కావాల్సి ఉన్నది. హైదరాబాద్‌ నగరం చుట్టూ ఉన్న ఏడు జిల్లాలు సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, నల్గొండ, వికారాబాద్‌ గుండా చౌటుప్పల్‌ దగ్గర భువనగిరి నుంచి వచ్చే రోడ్డు కలుస్తుంది. దాదాపు 300 గ్రామాలు ఈ రింగ్‌ రోడ్డు వల్ల ప్రభావితమవుతాయి.

ఇంకో 300 గ్రామాల భూముల ధరలపైనా ఈ ఎఫెక్ట్ కనిపిస్తున్నది. వీటి పరిధిలో లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. అటు 111 జీవో, ఇటు రీజినల్ రింగ్ రోడ్డు ఎఫెక్ట్.. జోరుగా సాగుతున్న ఓఆర్ఆర్ పరిధిలోని భూములపైనా కూడా పడింది. స్థలాలు, భూముల లావాదేవీలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి.